JC Diwakar Reddy  comments on ys jaganమాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో మరో సారి ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు.

రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడం స్వాగతించదగ్గ నిర్ణయమేనని, అందువల్ల మద్యం, డబ్బు పంపిణీ చాలా వరకు తగ్గుతుందని చెప్పారు.

తాను టీడీపీ అయినంత మాత్రాన ప్రతిదీ విమర్శించాలని లేదని చెబుతూ.. జగన్ చాలా తెలివైన వాడని సెటైర్ వేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కులాన్ని ఎత్తిచూపుతూ… ముఖ్యమంత్రి చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ… ప్రతి ఒక్కరికీ సమాజిక వర్గం ఉంటుందని, అది లేని వారు ఎవరో చెప్పాలని అన్నారు.

ఇది ఇలా ఉండగా స్థానిక ఎన్నికలలో తాము పోటీ చెయ్యమని చెప్పిన జేసీ ఆ తరువాత తమ వారిని పోటీలో నిలబెట్టారు. స్వయంగా ఆయన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నాయకులలో, క్యాడర్ లో ధైర్యం నింపడానికి కార్పొరేటర్ గా నిలబడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొడుకుకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.