Jayaprakash Narayana responds on capital amaravatiవైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై రాజధాని రైతుల నిరసనలు పదిహేనవ రోజుకు చేరుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలను కూడా పక్కన పెట్టి రైతు కుటుంబాలు ధర్నాలు చేస్తున్నాయి. రైతుల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకూ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.

మరోవైపు మంత్రులు మాత్రం తలో మాట అంటూ రైతులను మరింత బాధ పెడుతున్నారు. ఇది ఇలా ఉండగా మూడు రాజధానుల ప్రతిపాదనపై లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ స్పందించారు. ఇదో అర్థరహితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. “అభివృద్ధి వికేంద్రీకరించడం మంచి ఆలోచనే. కానీ పనులను మధ్యలోనే ఆపెయ్యడం పిచ్చి చర్య,” అని ఆయన అన్నారు.

“ప్రభుత్వం కోసం రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికే అక్కడ 8000-9000 కోట్ల పనులు చేసింది. 30000-40000 పెట్టుబడుల రావడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అవి కూడా ఆగిపోయాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు ఎందుకు వచ్చాం అని ఆలోచించేలా చేశారు,” అని జేపీ అభిప్రాయపడ్డారు.

“పోలవరం విషయంలో కూడా ఇలాగే చేశారు. పనులు ఆపకుండా ఉంటే ఈ సీజన్ కు ఫేస్ – 1 అయిపోయేది. అసెంబ్లీ ఒక చోట పెట్టడం, ఇంకోటి ఇంకో చోట పెట్టడం వికేంద్రీకరణ కాదు. పరిశ్రమలు రావాలి. వాటిని ఒక చోట పెట్టకుండా వేరు వేరు చోట్ల పెట్టాలి. అమరావతి ఆపేస్తే రెవిన్యూ డెఫిషిట్ పెంచుకున్నట్టే. పందేరాలకు 1000 కోట్లు పెంచుతున్నప్పుడు మౌలిక సదుపాయాల కోసం నిధులు లేవంటే ఎలా?,” అని ఆయన అన్నారు.