Jayalalithaa Death Report - Apolloతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత, తెలుగు నటుడు శోభన్ బాబుకు పుట్టానని, కావాలంటే డీఎన్ఎ పరీక్షకు కూడా సిద్ధమని చెబుతున్న అమృతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేధిక కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి తెలిపారు. చెన్నైలో మాట్లాడుతూ… జయలలిత కుమార్తెనని, ఆమె ఆస్తులకు సిసలైన వారసురాలినని చెబుతున్న అమృత, తన తండ్రి శోభన్ బాబు ఆస్తులను ఎందుకు కోరడం లేదని సూటిగా ప్రశ్నించారు.

జయలలిత మరణానంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై రాష్ట్ర ప్రజలు, అభిమానులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని అన్నారు. జయలలిత వారసులమంటూ కొత్తగా పుట్టుకొస్తున్న వారి ప్రకటనలు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇలా బయటకు వస్తున్న వాళ్లంతా… తాము జయలలిత, శోభన్ బాబుల సంతానం అని, తమకు బంధువులు చెప్పారని చెబుతున్నారని గుర్తు చేశారు. అదీ కాకుండా వీరంతా కేవలం జయలలిత వారసత్వం మాత్రమే కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. వారి మాటలను బట్టి వారంతా శోభన్ బాబు బిడ్డలైనా… ఆయన ఆస్తులను కోరడం లేదని ‘లాజిక్’గా మాట్లాడారు.

తాజాగా బెంగళూరు నుంచి వచ్చిన అమృత వెనక ఉన్న అదృశ్య శక్తులను బయటకు తీయాల్సిన అవసరం ఉందని, అధికారం కోసం 2012లో జయలలితపై విషప్రయోగానికి ప్రయత్నించిన శశికళే అమృత పాత్రను బయటకు తీసుకొచ్చినట్టు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేసారు. ఈ అమృత వెనుక మన్నార్ కుడి మాఫియా ఉందా? జయలలిత ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు శశికళ లేక జయలలిత మేనకోడలు, మేనల్లుడు పన్నిన పన్నాగంలో అమృత పాత్ర ఉందా? లేదా? అన్నది నిగ్గుతేల్చేందుకు సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, అమృత చెబుతున్న కథల్లో ఎక్కడా పొంతన కుదరడం లేదని చెప్పారు.

డీఎన్ఏ టెస్టు అని ఆమె చెప్పడం వెనుక… ఇప్పటికే అమృత డీఎన్‌ఏ శాంపిల్స్‌ తీసి, వాటినే జయలలిత శాంపిల్స్‌ గా సృష్టించారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ చేయించి, నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. దీనిపై ఇదివరకే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని, అయితే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సదరు కేసు దాఖలు చేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం సూచించిందని గుర్తు చేశారు. ఇప్పుడు దీనిపై ఆమె కుటుంబ సభ్యులెవరైనా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేస్తే వారికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇస్తున్నారు.