Jayalalithaa-soul in andhra pradeshతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ గురించి హల్చల్ వార్తలు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి చెన్నై మెరీనా బీచ్ లో కనపడిందని, మరోసారి అపోలో హాస్పిటల్ పార్కింగ్ లో ప్రత్యక్షం అయ్యిందని, ఇలా రకరకాల ఫోటోలు, వీడియోలు సందడి చేసాయి. అయితే ఆత్మలు తదితర అంశాలపై నమ్మకం పెట్టుకున్న వారు మరియు అమ్మ వీరాభిమానులు ఈ ఆత్మ విషయాన్ని సమర్ధించగా, మిగిలిన వారంతా అవన్నీ కేవలం కంప్యూటర్ మాయాజాలంగా కొట్టిపడేసారు.

ఏది ఏమైనా గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్న జయలలిత ఆత్మ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈ సారి రెగ్యులర్ గా చెన్నైలో కాకుండా, కాస్త వెరైటీగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో చిత్తూరులో ‘అమ్మ’ ఆత్మ తిరుగుతున్నట్లుగా సమాచారం. చెన్నై సిఎంగా విధులు నిర్వహించిన అమ్మ ఆత్మ, ఏపీకి ఎందుకు వచ్చినట్లు? అనే ప్రశ్న తలెత్తితే… ఓ కారు గురించి తెలుసుకోవాల్సిందే. గతంలో జయలలిత వినియోగించిన కారు ప్రస్తుతం ఏపీ పోలీసుల ఆధీనంలో ఉంది.

టీఎన్07 వి 1948 అనే నెంబరు గల కారును జయలలిత ఉపయోగించుకున్న తర్వాత అమ్మివేయగా, ఆ కారు రెండు చేతులు మారింది. అయితే అది ఇటీవల చిత్తూరు జిల్లా కెవిబిపురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలో గల ఓ ఖాళీ ప్రదేశంలో నిలిచి ఉంది. గత కొన్ని రోజులుగా అక్కడే ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఆ కారును కాస్త పోలీసులు స్వాధీనం చేసుకుని, స్టేషన్ కు తరలించారు. ఇంతకీ ఆ కారు అన్ని రోజులు ఆ స్థలంలో ఎందుకు ఉంది? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇక్కడే జయలలిత ఆత్మ కాన్సెప్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ‘అమ్మ’ ఆత్మ రూపంలో సదరు కారులో తిరుగుతోందని, దీంతో భయబ్రాంతులకు గురైన ప్రస్తుత యాజమాని ఆ కారును అక్కడ వదిలి ఉండవచ్చని స్థానికంగా రకరకాలుగా వినపడుతున్న టాక్. ఏది ఏమైనా కారు అమ్మది కావడంతో, ఆమె లేదు గనుక వెంటనే ఆత్మ కధ ప్రత్యక్షం అయ్యింది. చెన్నై నుండి ఏపీకి మారిన జయలలిత ఆత్మ కధలో… నెక్స్ట్ సీక్వెల్ స్టోరీ ఏ ఊరులో ప్రారంభమవుతుందో… అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.