Jayalalithaa Health Is Well Returns Home Soonఅనారోగ్యానికి గురై సెప్టెంబర్ నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే జయలలిత ఎప్పుడో కాలం చేసిందని, కొన్ని రాజకీయ ప్రయోజనాల రీత్యా ఈ విషయాన్ని బయటపెట్టడం లేదని జరిగిన ప్రచారం, కొందరి అరెస్ట్ లకు కూడా కారణమైంది. అయితే తాజాగా లభిస్తున్న సమాచారం మేరకు జయలలిత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందని తెలుస్తోంది.

ఎంతలా రికవరీ అయ్యిందంటే… జయలలిత స్వయంగా ఆహారం తీసుకునేటంత! ఈ నేపథ్యంలో జయమ్మ డిశ్చార్జి కోసం వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు. దేశ, విదేశీ వైద్యుల చికిత్సతో కోలుకున్న సీఎం వైద్యులతో మాట్లాడుతున్నారు. ఆమెకు చికిత్స అందిస్తున్న లండన్ వైద్యుడు మంగళవారం ఆస్పత్రిలో ఆమెకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. నేడు కూడా పరీక్షించిన మీదట, వైద్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లయితే, జయలలితను గురువారం నాడు డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

దీంతో తమిళనాట పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంది. అసలే దీపావళి సందర్భంగా ఖుషీలో ఉన్న ప్రజలకు, ‘అమ్మ’ ఆసుపత్రి నుండి బయటకు వస్తున్నారన్న వార్తలు నిజమైన దీపావళిగా భావిస్తున్నారు. అలాగే అన్నాడిఏంకే పార్టీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు టాక్. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న జయమ్మ ఆరోగ్యం ఓ కొలిక్కి రావడంతో, రాజకీయ అనిశ్చితి ఏర్పడే అవకాశం లేదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు.