Jayalalithaaతమిళనాట రెండవ సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించిన జయలలిత ఆరోగ్యం ఎలా ఉంది? ముద్దుగా ‘అమ్మ’గా పిలుచుకునే తమిళనాడు ప్రజల గుండెల్లో ప్రస్తుతం మెదులుతున్న ఏకైక ప్రశ్న ఇది? సాధారణంగా ముఖ్యమంత్రి వంటి వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో డాక్టర్లు నిర్విరామంగా హెల్త్ బులిటెన్ లు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, జయలలిత చికిత్స తీసుకుంటున్న అపోలో హాస్పిటల్ డాక్టర్లు గత రెండు రోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ ను విడుదల చేయకపోవడంతో… ‘అమ్మ’ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వీటికి తోడు జరుగుతున్న పరిణామాలు వారి ఆందోళనను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న గవర్నర్ ఒక్కసారిగా జయలలిత ఉంటున్న ఆసుపత్రికి పయనం కావడం ఒకటైతే, నేటి ఉదయం నుండి పోలీసు వర్గాలు చేస్తున్న చర్యలు దేనికి సంకేతాలు అన్న ప్రశ్నలను రేపుతోంది. అపోలో హాస్పిటల్ పరిసరాల్లో ట్రాఫిక్ నిబంధనలు విధించగా, నేటి ఉదయం నుండి పోలీసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూ… భద్రతా వలయం ఎక్కువవుతుండడం కాస్త ఆలోచించదగ్గ విషయంగా తమిళనాడు ప్రజలు పేర్కొంటున్నారు.

జ్వరం, డీహైడ్రేషన్ తో కూడిన నీరసం కారణంగా 10 రోజుల క్రితం అపోలో హాస్పిటల్ లో చేరిన జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి, కేవలం మూడు సార్లు మాత్రమే ఎందుకు సమాచారం ఇచ్చారు? లండన్ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, చికిత్సకు ‘అమ్మ’ జయలలిత స్పందిస్తోందని పార్టీ వర్గాలు, కార్యకర్తలు చెప్తున్నా… అసలు స్పందించలేనంత పరిస్థితికి వెళ్ళిందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జయలలిత ఆరోగ్యంపై వదంతులకు కారణమైంది. బహుశా గవర్నర్ కలిసిన తర్వాత ఓ అధికారిక ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది.