Jayalalithaa funeral in hindu ritualsతమిళనాడును విడిచి అమ్మ వెళ్ళలేకపోతోందని, అందుకనే ఆత్మ రూపంలో మెరీనా బీచ్ వద్ద సంచారం చేస్తోందని ఇటీవల జరిగిన ప్రచారం గురించి తెలిసిన విషయమే. దీనికి సంబంధించి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యాయి. అయితే ఇదంతా ఉత్త భ్రమ, ఆ ఫోటోలన్నీ కంప్యూటర్ మాయాజాలం అని కొట్టిపడేసిన వారి సంఖ్యే ఎక్కువ. అయితే జయలలిత విషయంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండడం విశేషం.

అమ్మ ఆత్మకు శాంతి చేకూరదంటూ మరొకసారి జయలలితకు అంత్యక్రియలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. హిందూ సంప్రదాయాల ప్రకారం మరణించిన తర్వాత దహన కార్యక్రమాలు నిర్వహిస్తారు, కానీ జయలలిత విషయంలో అలా కాకుండా ఖననం చేసారు. దీంతో మరొకసారి జయలలిత సోదరుడి వరసయ్యే వరదరాజు చేత ప్రముఖ పూజారి రంగనాథ్ అయ్యంగార్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో పవిత్ర కావేరీ నది ఒడ్డున పశ్చిమవాహినిలో ఆమెకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఓ బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ ఆత్మకు శాంతి కలిగేందుకు మరో ఐదు రోజుల పాటు మరికొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. తన సోదరి హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని, అందుకే ఆమెకు మళ్లీ అంత్యక్రియలను నిర్వహించామని వరదరాజు చెప్పారు. చెన్నైలో ఆమెను ఖననం చేసిన తీరు పట్ల మేలుకొటే, మైసూరుల్లో ఉండే ఆమె మేనల్లుళ్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. వీరు కూడా జయకు నిర్వహించిన తాజా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

అయితే జయ మరణించిన 9వ రోజుల తర్వాత ఈ కార్యక్రమాలు చోటు చేసుకోవడంతో మిక్కిలి ప్రాధాన్యతను దక్కించుకున్నాయి. ఓ పక్కన మెరీనా బీచ్ లో జయను ఖననం చేసిన ప్రాంతంలో ఆత్మ రూపంలో ఒక ప్రతిబింబం దర్శనం ఇవ్వడం, మరో పక్కన ఆత్మకు శాంతి చేకూరలేదంటూ అంత్యక్రియలు నిర్వహించడంతో… ఆ ఫోటోలో కనిపించినది నిజమైన ఆత్మేనా అన్న కోణంలో తమిళనాట చర్చలు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా జయ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలన్నీ సంచలనాత్మకంగా నిలుస్తున్నాయి.