jayalalithaa-death-news-is-heart-attack-to-many-people-deathపావురాలగుట్ట మీద జరిగిన ప్రమాదానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అనేక మంది ప్రజల గుండెలు ఆగిపోయాయి. అయితే లెక్కల విషయంలో జగన్ మీడియాకు, ఇతరులకు కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ, వైఎస్ మరణం అనేక మందిని బాధించి, వైఎస్ తో పాటు మరికొందరిని కూడా తీసుకెళ్లిందన్న విషయం నిజమే.

అప్పట్లో ఇలా మరణించడం చూసి… తెలుగు గుండెకాయలు మరీ వీక్ అందుకనే, ఒక వ్యక్తి మరణించగానే అలా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నవారున్నారు. కానీ, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలుగు ప్రజల గుండెలే కాదు, తమిళ ప్రజల గుండెకాయలు కూడా చాలా వీక్ అన్న విషయం స్పష్టమవుతోంది.

‘అమ్మ’ మరణవార్తను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 280 మంది మృతి చెందినట్లు అధికార అన్నాడీఎంకే పార్టీ తాజాగా ప్ర‌క‌టించింది. మృతి చెందిన వ్య‌క్తుల కుటుంబాల‌కు 3 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని తెలుపుతూ, ప్రాణాలు కోల్పోయిన వారి తాజా జాబితాను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 77 మంది మృతుల పేర్లను ప్రకటించిన అన్నాడీఎంకే శ్రేణులు తాజా జాబితాలో మ‌రో 203 మంది పేర్లను పేర్కొన్నాయి.

మృతుల‌ కుటుంబాలతో పాటు అమ్మ కోసం ఆత్మాహుతి యత్నం చేసిన వ్య‌క్తికి, అమ్మ కోసం చేతి వేళ్లు కోసుకున్న మరో వ్య‌క్తికి కూడా ప‌రిహారంగా 50 వేలు చొప్పున ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాల పార్టీలు ఎలాంటి గోలలు చేయకపోవడంతో… ఏపీలో మాదిరి కాకుండా, అక్కడ ఖచ్చితమైన సంఖ్యను ఇచ్చారేమోనన్న భావన వ్యక్తమవుతోంది.