jayalalithaa-death-mysteryతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ‘అమ్మ’ జయలలితను ప్రత్యక్ష దైవంగా కొలిచే ప్రజలకు కొదవలేదు. అయితే ‘అమ్మ’ మరణం అభిమానులకు తీరని శోకాన్ని మిగల్చగా, ఈ పురుచ్చతలైవి మరణం వెనుక అనేక కోణాలు ఉన్నాయంటూ తాజాగా ఒక్కొక్కటి వెలుగుచూస్తోంది. ఇప్పటికే శశికళపై చాలా ఆరోపణలు వ్యక్తం కాగా, తాజాగా అమ్మ మరణానికి ఓ దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహమే కారణమన్న ప్రచారం ఊపందుకుంది.

కాంచీపురం జిల్లాలో అత్యంత పురాతనమైన ప్రసిద్ధ ఏకాంబరనాథర్‌ ఆలయంలో మూలవిరాట్టు విగ్రహం మట్టితో చేసి ఉంటుంది. అయితే ఈ విగ్రహం ధ్వంసమైందన్న కారణంతో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. కానీ, చిన్నపాటి మరమ్మతులు చేస్తే సరిపోతుందని శిల్పులు, మూల విరాట్టు విగ్రహాన్ని మార్చడం వల్ల రాష్ట్రాధినేతకు ప్రాణహాని కలగవచ్చని పలువురు సూచించినా లెక్క చేయని కమిటీ 5వ తేదీన విగ్రహాన్ని ప్రతిష్టించింది.

అయితే 5వ తేదీన అమ్మ కాలం చేయడం, అదే తేదీన విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో… ఈ కారణం వలనే రాష్ట్ర ముఖ్యాధినేత మరణించిందన్న ప్రచారం తమిళనాట ప్రారంభమైంది. ఎన్నో పురాతన దేవాలయాలు, ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలకు నిలయమైన తమిళనాడులో భక్తులకు నమ్మకాలు ఎక్కవన్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా కాంచీపురంలో జరిగిన విగ్రహ ప్రతిష్టకు, జయలలిత మరణానికి ముడిపెట్టిచూస్తున్నారు. అంతేలెండి… ఎవరి నమ్మకాలు వారివి..!