jayalalithaa-death-mysterious-reasons-will-revealed-deepa-jayakumar‘అమ్మ’ మరణం తర్వాత తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. జయ నెచ్చెలి శశికళ కొత్త అధికార కేంద్రంగా తయారైన తర్వాత ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నుంచి మంత్రుల వరకు అందరూ క్యూ కడుతున్నారు. మరో పక్క శశికళ పొడగిట్టని వారు ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఎత్తులు, పై ఎత్తులతో ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీ సెగలు కక్కుతోంది. ఈ క్రమంలో బయటకొచ్చిన తాజా సంచలనం జయ మేనకోడలు దీప… ‘అమ్మ’ (వరుసకు అత్త) మరణం వెనక ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని, వాటన్నింటినీ త్వరలోనే బయటపెడతానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

“జయలలితకు వచ్చిన అనారోగ్యం ఏమిటి? అకస్మాత్తుగా ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటన్న సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెను చూసేందుకు ఎవరినీ ఎందుకు అనుమతించలేదు? ప్రజల నుంచి అమ్మను దూరం చేసింది ఆమె వెన్నంటి ఉన్న వారేనా? లేక మరేదైనా శక్తా? అన్న అనుమానాలు నాతో సహా చాలామందికి ఉన్నాయి. దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్న విషయం నాకు తెలుసు. సరైన సమయంలో బయటపెడతా.”

1995లో నాన్న చనిపోయాక కూడా మా రెండు కుటుంబాల మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. 2007లో చివరిసారిగా నేను అత్తను కలుసుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు అత్తను కలుసుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫోన్ చేస్తే మేడమ్ బిజీగా ఉన్నారంటూ ఫోన్ ఇచ్చేవారు కాదు. దీంతో లేఖలు రాశా. వాటినీ ఆమెకు చేరకుండా అడ్డుకున్నారు. అత్త ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దేశపూర్వకంగానే కొందరు మమ్మల్ని ఆమె నుంచి దూరం చేశారు. జయలలితే మమ్మల్ని దూరం పెట్టారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆమెకు మేమంటే ఎంతో అభిమానం. కుటుంబం అన్నాక చిన్నచిన్న సమస్యలు సహజం.

జయ ఆస్పత్రిలో ఉన్నారన్న విషయం టీవీలో చూసేవరకు మాకు తెలియదు. ఆమె రక్త సంబంధీకులుగా ఆ విషయం మాకు తెలియపర్చాల్సిన అవసరమున్నా ఆ పని చేయలేదు. నేను ఆమె మేనకోడలినని తెలిసినా ఆస్పత్రిలో నన్ను అడ్డుకున్నారు. జయ రెక్కల కష్టంతో అభివృద్ధి చేసిన పార్టీ ఇప్పుడు పరుల చేతికి చిక్కబోతోంది. కార్యకర్తలు దీనిని ఆమోదించడం లేదు. అత్త లక్ష్య సాధన కోసం పార్టీని ‘వారి’ చేతికి చిక్కకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది.

జయలలిత కూడా శశికళను తన వారసురాలిగా భావించలేదు. అలాంటి మహిళ ఇప్పుడు పార్టీ పగ్గాలు ఎలా చేపడుతుంది? ప్రజలకు కూడా ఈ విషయాలన్నీ తెలుసు. అత్త బతికి ఉన్నప్పుడు ‘అమ్మ.. అమ్మ’ అని తిరిగిన నాయకులు ఇప్పుడు ఆమె వ్యతిరేక శక్తులకు పాదాభివందనం చేస్తుంటే బాధనిపిస్తోంది. జయలలిత 2014లో జైలుకు వెళ్లినప్పటి నుంచి సెప్టెంబరు 22 వరకు ఆమె వెనక ఎన్నో కుట్రలు జరిగాయి. వాటన్నింటినీ బయటపెడతా… అమ్మ వారసురాలిని నేనే… త్వరలోనే రాజకీయ అరంగ్రేటం చేస్తా… అని చెప్పుకొచ్చారు జయ మేనకోడలు దీప.