jayalalithaa-death-597-people-died-17-crores-as-compensationsనాటకీయ పరిణామాల మధ్య ప్రకటించిన తమిళనాడు ‘అమ్మ’ జయలలిత మరణవార్త, ఆమె అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అయితే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు నమోదు కాకుండా అదుపు చేయగలిగిన ప్రభుత్వ, అభిమానుల మనోవేదనలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. దీని పర్యవసానమే ఇప్పటివరకు 597 మంది జయలలిత మరణవార్త విని చనిపోయినట్లుగా పార్టీ నేతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ 597 మంది కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పిన నేతలు, ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లుగా తెలిపారు. అంటే ‘పురుచ్చతలైవి’ పేరు క్రింద చనిపోయిన కుటుంబాలకు మొత్తం 17,91,00,000 రూపాయలు ఆర్ధిక సాయంగా ఖర్చు చేయనుందన్న మాట. ఇవి కాక, గాయపడిన మరో ఇద్దరు అభిమానులకు చెరో 50 వేల రూపాయలు చొప్పున ఒక లక్ష రూపాయలు ప్రకటించారు.

దీంతో మొత్తం 17 కోట్ల 92 లక్షల రూపాయలను జయలలిత మరణం తర్వాత, ఆమె పేరుతో ఖర్చు చేయనున్నారన్న మాట. మరి ఇక్కడితో లెక్క ఆగుతుందో లేక మరింతగా కొనసాగుతుందో తెలియని పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ మరణించిన సమయంలో కూడా ఇలాంటి లెక్కలే వెలువడగా, ఆ లెక్కల్లో బొక్కలు ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడిన విషయం తెలిసిందే. అయితే జయలలిత అభిమానుల మరణం విషయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం విశేషం.