Jayalalithaa daughter Amrutha undergo DNA test in Hyderabad.jpgజయలలిత కుమార్తెగా చెప్పుకుంటున్న అమృత వ్యవహారం మరోమారు బయటకు వచ్చింది. తాను జయ కుమార్తెనంటూ తెరపైకి వచ్చిన అమృత ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను జయ కుమార్తెనని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం సూచన మేరకు ఆ తర్వాత మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు.

ఈ నేపథ్యంలో వచ్చే నెల 2న కేసు విచారణకు రానుంది. ఈ కేసులో అత్యంత కీలకమైనది, బలమైనది డీఎన్ఏ ఒక్కటే కాబట్టి అమృత హైదరాబాద్‌ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)ని సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తమకు ఇప్పటి వరకు ఎటువంటి నమూనాలు అందలేని సీసీఎంబీ అధికార ప్రతినిధి తెలిపారు.

నిజానికి సీసీఎంబీ ప్రైవేటు వ్యక్తుల నుంచి డీఎన్ఏ సేకరించదు. కోర్టు ఆదేశాలపై మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇక అమృత కేసు విషయానికి వస్తే ఆమె చెబుతున్న తల్లి, తండ్రి ఇద్దరూ లేరు. కాబట్టి ఆమె బంధువుల నుంచి రక్తపు నమూనాలు సేకరించి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇక జయలలిత మరణించారు కాబట్టి ఆమె రక్త నమూనాలు సేకరించే అవకాశం లేదు.

ఆమె అస్థికల డీఎన్ఏను సేకరించే వీలు లేకపోతే ఆమె తోడబుట్టిన వారి నుంచి రక్తనమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ఈ కేసును శాస్త్రరీత్యా నిరూపించడం అంత కష్టమైన పనేమీ కాదని మరోపక్క ట్రూత్ ల్యాబ్స్ డైరెక్టర్ గాంధీ పేర్కొన్నారు.