Apollo denies reports of Jayalalithaa's deathతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వర్గస్తులైనారు… ఇది స్థానికంగా తమిళ మీడియా ఛానల్స్ ప్రసారం చేస్తున్న వార్తలు. ఈ తమిళ మీడియా ఛానల్స్ ప్రసారం చేసిన కధనాలను చూసిన అభిమానులు అపోలో ఆసుపత్రి వద్ద తమ ఆవేదనను ఆందోళన రూపంలో వెలిబుచ్చారు. దీనిని బేస్ చేసుకుని పలు తెలుగు మీడియా ఛానల్స్ కూడా జయలలిత కన్నుమూసినట్లుగా ప్రసారం చేసారు. ఇది కాస్త జాతీయ వ్యాప్తంగా ప్రచారం ఊపందుకోవడంతో అపోలో ఆసుపత్రి ఓ అధికారిక ట్వీట్ చేసారు.

“జయలలితకు ఇంకా చికిత్స కొనసాగుతోంది, ఎయిమ్స్, అపోలో బృందంతో కూడిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు” అని స్పష్టం చేసారు. ఈ ట్వీట్ నే కాసేపటికి ఓ అధికారిక ప్రెస్ బులిటెన్ ద్వారా కూడా విడుదల చేసారు. జయలలిత చనిపోయిందంటూ వచ్చిన వార్తలను ఎవరూ నమ్మవద్దని అపోలో యాజమాన్యం అభిమానులను కోరింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, అంతకుముందే అన్నాడిఏంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా క్రిందకు దింపడం దేనికి సంకేతాలు అని పలు మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో అసలు అపోలో ఆసుపత్రిలో ఏం జరుగుతుందా? అన్న సందేహం అమ్మ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

ఈ పరిణామాలన్నీ ఒక్కొక్కటిగా జరుగుతుండగానే… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. బహుశా వెంకయ్య నాయుడు బయటకు వచ్చిన తర్వాత అయినా ఏమైనా స్పష్టమైన సమాచారం ఇస్తారేమోనని జయమ్మ అభిమానులు, తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో పక్కన సోషల్ మీడియాలో మాత్రం జయలలిత ఆత్మ శాంతి చేకూరాలని చెప్తూ పరామర్శల వెల్లువ ఉదృతంగా కొనసాగుతోంది. వీటన్నింటికి శుభంకార్డు పడాలంటే… కేంద్రం నుండి గానీ, గవర్నర్ నుండి గానీ స్పష్టమైన సమాచారం వెలువడాల్సిందే!