Jaya-Prada-rentry-andhra-pradesh-politics-మంగళవారం రాజమండ్రిలో జరిగిన బిజెపి గర్జన సభలో అలనాటి మేటి నటి, బిజెపి మహిళా నేత జయప్రద పాల్గొని సభలో మాట్లాడటం చాలా ఆసక్తికరమైన కొత్త పరిణామంగా భావించవచ్చు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు తనకు మళ్ళీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పాల్గొనాలని ఉందని జయప్రద చెప్పారు. చెప్పిన కొద్ది రోజులకే రాజమండ్రి బహిరంగ సభలో ఆమె ప్రత్యక్షమవడం, సభలో ప్రసంగించడం ద్వారా ఆమె ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలోకి మళ్ళీ ప్రవేశిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

చాలా రోజుల తరువాత తొలిసారిగా చేసిన ఆమె ప్రసంగం పెద్దగా ఆకట్టుకోనప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వలన తన జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను విడిచిపెట్టి ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళిపోయానని అందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పుకొంటున్నానని జయప్రద చెప్పడం అందరినీ ఆకట్టుకొంది.

రాష్ట్ర ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పుకోవలసిన అవసరం లేనప్పటికీ క్షమాపణలు చెప్పుకోవడం, అప్పుల రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌ను అందరూ కలిసి మళ్ళీ స్వర్ణాంద్ర ప్రదేశ్‌గా తీర్చి దిద్దుకొందామని ఆమె చెప్పడం రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశానికి తొలి సంకేతంగానే భావించవచ్చు.

అయితే రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్నట్టి సందిగ్ద రాజకీయ పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు ఏపీలో నెలకొని ఉన్నాయి. సీనియర్ నేతలు పురందేశ్వరి వంటివారే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూసి ఆంటీముట్టనట్లు వ్యవహరిస్తుంటే దాదాపు మూడు దశాబ్ధాలుగా ఏపీకి దూరంగా ఉన్న జయప్రద రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి నిలద్రొక్కుకోగలరా?చూడాలి.