January Movie Releases 2023 జనవరి ప్రారంభం టాలీవుడ్ కు మంచి వెలుగులే తీసుకొచ్చింది. కరోనా తర్వాత అత్యంత వేగంగా పుంజుకున్న పరిశ్రమల్లో తెలుగు సినిమానే ముందుంది. ఇప్పుడంటే నార్త్ బాక్సాఫీస్ పఠాన్ ని చూసుకుని మురిసిపోతోంది కానీ గత మూడేళ్లుగా అక్కడి ట్రేడ్ చూస్తున్న నరకం అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, కాంతారలు లేకపోతే వాళ్ళ పరిస్థితి మరింత దయనీయంగా మారేది. అంతకంతా మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ పోతున్న మన సీనియర్ స్టార్లు ఈసారి న్యూ ఇయర్ కి గ్రాండ్ ఓపెనింగ్ తీసుకొచ్చారు

సంక్రాంతికి వచ్చిన వాటిలో వాల్తేరు వీరయ్య విజయం ఏకంగా వంద కోట్లకు పైగా షేర్ తో విజేతగా నిలిచింది. గొప్పగా చెప్పుకునే కంటెంట్ లేకపోయినా పండగ సీజన్ తో పాటు వింటేజ్ మెగాస్టార్ ని చూపించారన్న మాట, కామెడీ అంశాలు పబ్లిక్ లోకి బలంగా వెళ్లడం పని చేసింది. వీరసింహారెడ్డి సైతం టాక్ పరంగా ఊగిసలాడినప్పటికీ అఖండని దాటేసి ఎనభై కోట్ల షేర్ ని అందుకోవడం బాలయ్య స్టామినాని చాటింది. ఒకవేళ సోలోగా వచ్చి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం దక్కేదన్న అభిమానుల కామెంట్లో నిజం లేకపోలేదు. ఈ రెండు విజయాలు మంచి బూస్ట్ ఇచ్చాయి.

డబ్బింగ్ చిత్రానికి థియేటర్లు ఎక్కువిస్తారా అనే వివాదంలో బాగా నలిగిన వారసుడు రొటీన్ కథా కథానాలతో ముక్కుతూ మూలుగుతూ కష్టపడి యావరేజ్ మెట్టు దాకా వెళ్ళింది. తమిళం సంగతి ఎలా ఉన్నా తెగింపుకి ఇక్కడ మాత్రం పరాభవం తప్పలేదు. బిజినెస్ తక్కువ చేశారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నష్టం చాలా తీవ్రంగా ఉండేది. ఇక కళ్యాణం కమనీయం అర్థం లేని రిస్కు తీసుకుని కేవలం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉందన్న ఒకే కారణంగా రిలీజ్ చేయడం వల్ల చిరు బాలయ్యల మధ్య దారుణంగా నలిగిపోయింది.

సుధీర్ బాబు హంట్ ది మరో ట్రాజెడీ. ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన మలయాళం సినిమాని రీమేక్ చేసే ముందు ప్రాక్టికల్ గా ఆలోచించకలేకపోవడంతో పాటు ఆడియన్స్ టేస్ట్ ని తప్పుగా అంచనా వేయడం కనీస ఖర్చులను వెనక్కు తేలేకపోయింది. ఇతని కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అందుకుంది. ఇవి కాకుండా చిన్నా చితకా చిత్రాలు చాలానే వచ్చాయి కానీ దాదాపు అన్నీ మార్నింగ్ షోకే తేలిపోయాయి. మాలికాపురం కేరళలో వంద కోట్లు వసూలు చేస్తే ఇక్కడ కనీసం రిలీజైన విషయం జనానికి తెలియకుండా పోయింది. ఎలా చూసుకున్నా ఇతర భాషలతో పోల్చుకుంటే మనతో పాటు తమిళ పరిశ్రమ మంచి ఆరంభాన్ని అందుకుంది.