‘ప్రత్యేక హోదా’ అంటూ గత రెండు రోజులుగా తెగ సందడి చేస్తోన్న వైసీపీ వర్గానికి షాకింగ్ లాంటి విషయాన్ని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర వెల్లడించారు. విభజన సమస్యల కోసం త్రిసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సందర్భంలో హైలైట్ అయిన స్పెషల్ స్టేటస్ అంశం ‘జగన్ వలనే సాధ్యమైందని’ వైసీపీ వర్గాలు భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నాయి.

జనవరిలో జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా ప్రత్యేక హోదా విషయాన్ని చర్చించినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే సమాచార హక్కు చట్టం క్రింద తీసుకున్న వివరాలను కనకమేడల బయట పెట్టడంతో అసలు విషయం బయట పడింది, వైసీపీ వర్గాలు తెల్లముఖం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.

“జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సమయంలో ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావించలేదు, కేవలం రుణపరిమితిని మాత్రమే పెంచాలని” ఏపీ సీఎం జగన్ కోరినట్లుగా రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. ఈ వివరణతో మరోసారి జగన్ బండారం బట్టబయలు అయ్యింది.

మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా వైసీపీ వర్గంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. త్రిసభ్య కమిటీ ఎజెండా నుండి ప్రత్యేక హోదాను తొలగించడం వెనుక చంద్రబాబు హస్తముందని వైసీపీ చేస్తోన్న ప్రచారాన్ని తిప్పికొడుతూ… చంద్రబాబు చెప్తే తాము చేస్తామా? అంటూ ప్రశ్నించారు.

ఏ మాత్రం సిగ్గులేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, ప్రధాని మోడీ – అమిత్ షాల ద్వయం తీసుకున్న నిర్ణయాలను మార్చగలమా? వైసీపీది ఆర్భాటమే తప్ప, రాష్ట్రానికి చేసిందేమి లేదని, బీజేపీపై బురద జల్లే విధంగా వైసీపీ చేస్తోన్న రాజకీయాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని మండిపడ్డారు.