January 26 Public Meeting Pawan Kalyanజనవరి 26… ప్రస్తుతం అందరి దృష్టి ఈ రోజు మీదే ఉంది. కారణం… ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలోని ఆర్కే బీచ్ లో ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. హోదా కోసం ఏపీ యువత ఏకమవుతోంది. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత హాజరుకావాలంటూ… గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో, పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కానుండడంతో స్పందన విశేషంగా లభిస్తోంది.

మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే రోజు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండనున్నారు. మరుసటి రోజు నుంచే ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పోలీసులకు కత్తి మీద సామే. అయితే, నిరసన కార్యక్రమం అనుమతి కోసం ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓ వైపు నిరసన కార్యక్రమం జరుగుతుంటే… అక్కడే ఉన్న ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారిన పెట్టుబడుల సదస్సుకు ముందు ఇలాంటి పరిణామాలు ఇన్వెస్టర్స్ లో భయానకాన్ని సృష్టిస్తాయనేది విశ్లేషకుల మాట.