దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన “జనతా గ్యారేజ్” పాటలను ఒక్కొక్కటిగా లహరి సంస్థ విడుదల చేసింది. ఈ ఆల్బమ్ లో దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ క్యాచీగా ఉన్నప్పటికీ, ‘సాహిత్యం’ యొక్క విలువ ఎలా ఉంటుందో మరోసారి ‘జయహో జనతా’ అనే పాట చాటిచెప్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే… బహుశా ఈ పాటను రిపీట్ మోడ్ లో పెట్టేసుకుని వింటుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి టీజర్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన అద్భుతమైన సంగీతంతో ప్రారంభమైన ఈ పాట లిరిక్స్ అద్భుతంగా
“ఎవ్వరు ఎవ్వరు వీరెవరూ… ఎవరికి వరుసకు ఏమవరు… అయినా అందరి బంధువులు… జయహో జనతా” అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు సుఖ్విందర్ సింగ్ ఆలపించాడు. ఇక పవర్ ఫుల్ సాహిత్యాన్ని అందించే బాధ్యతను రామజోగయ్య శాస్త్రి అందుకుని, ‘జనతా గ్యారేజ్’ ఆల్బమ్ కే హైలైట్ సాంగ్ ని అందించారు. ఒక రకంగా సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని, హీరో పాత్రధారణను ఈ ఒక్క పాటలో చూపించారని చెప్పవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో సాగే పాటలా వినపడుతున్న దీని గురించి ఇంకా చెప్పాలంటే… కొరటాల శివ గత రెండు సినిమాల గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి.
‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ని ఎలివేట్ చేస్తూ ‘పండగలా వచ్చాడు…’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ పాత్రను సూచిస్తూ ‘పోరా శ్రిమంతుడా’ పాట ఏ రేంజ్ లో ప్రేక్షకులను కట్టిపడేసిందో కూడా తెలిసిన విషయమే. అలా హీరో పాత్రకు ఒక ఎలివేట్ సాంగ్ ఇస్తూ ‘హీరోయిజం’ చూపించడంలో కొరటాలది ఒక ప్రత్యేకమైన శైలి. వినగానే రోమాలు నిక్కపోడిచేలా ఉండే ఆ పాటలకు తోడు ఈ ‘జనతా గ్యారేజ్’లో కూడా అదే రకమైన్ థీమ్ తో ఈ ‘జయహో జనతా’ పాటను పెట్టినట్లుగా స్పష్టం అవుతోంది.
విన్నకొద్దీ వినాలనిపించేలా సాగే ఈ పాటలో ముఖ్యమైన లిరిక్స్…
ఒక్కడు కాదు ఏడుగురు… దేవుడు పంపిన సైనికులు… సాయం చేసే సాయుధులు…
వెనుకడుగు వేయబోరు, మనకెందుకు అనుకోరు… జగమంతా మనదే, పరివారం అంటారు…
ప్రాణం పోతున్నా… ప్రమాదం అనుకోరు…
ఆపదలో ఓ నిట్టూర్పు, అది చాల్లే వీరికి పిలుపు… దూసుకుపోతారు, దుర్మార్గం విరిపేలా…
ఎక్కడికక్కడ తీర్పు, వీరందించే ఓదార్పు… తోడై ఉంటారు, తోబుట్టిన బంధంలా…
ధర్మం గెలవని చోట, తప్పదు కత్తుల వేట… తప్పు ఒప్పు ఏంటో సంహారం తరువాత…
రణమున భగవద్గీత, చదివింది మన గత చరిత…. రక్కసి మూకలకు బతికే హక్కే లేదంట…
ఎవరో వస్తారు… మనకేదో చేస్తారు… అని వేచే వేదనకు జవాబే… ఈ జనతా..!