భారీ అంచనాలతో విడుదలైన కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల “జనతా గ్యారేజ్”కు తొలి రోజు ప్రేక్షకుల నుండి విభిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. అయితే టాక్ ఎలా ఉన్నా… కలెక్షన్స్ లో మాత్రం దుమ్ము దులుపుతోంది ‘జనతా గ్యారేజ్.’ ఎంతలా అంటే… తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘బాహుబలి’ తర్వాత స్థానంలో నిలిచిన ‘శ్రీమంతుడు’ రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లో ఓపెనింగ్స్ దుమ్ము దులుపుతోంది.
అయితే ఇవేవో కాకి లెక్కలు కాదు అంటూ స్వయంగా నిర్మాతలే ఒక అధికారిక పోస్టర్ ను విడుదల చేసారు. అతి తక్కువ సమయంలో 50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమాల జాబితాలో ‘జనతా గ్యారేజ్’ రెండవ స్థానంలో నిలిచిందని ఒక పోస్టర్ ను విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు కూడా వీరే కావడంతో, కలెక్షన్స్ పై మరింత స్పష్టతతో ప్రకటన వచ్చి ఉండవచ్చు అన్నది సినీ పరిశీలకుల మాట.
50 కోట్ల క్లబ్ రికార్డును రెండవ సారి అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ తదుపర్ టార్గెట్, ఆల్ టైం రికార్డులపై పడింది. వీకెండ్ కు తోడు వినాయకచవితి కూడా కలిసి రావడంతో, టాక్ తో నిమిత్తం లేకుండా తొలి 5 రోజులు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిసింది. మరి ఇదే ఊపులో ఆల్ టైం జాబితా లక్ష్యాన్ని కూడా జూనియర్ అందుకుంటాడా? ‘బాహుబలి’ సినిమా రికార్డులు మినహా ఉన్న ‘శ్రీమంతుడు’ రికార్డులన్నీ మోహన్ లాల్ – తారక్ లు వశం చేసుకుంటారా? అనేది రెండవ వారంలోనే తేలనుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రం బిగ్గెస్ట్ హిట్ గా నెంబర్ 1 స్థానాన్ని ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ ఆక్రమించింది.