janatha-garage-2nd-135-crores-grosser-tfi‘జనతా గ్యారేజ్’ అందుకున్న అనూహ్య విజయం ఆల్ టైం జాబితాను తారుమారు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టాప్ 3లో మెగా హీరోల సినిమాలను లేకుండా చేసిన ‘జనతా గ్యారేజ్’ రెండవ స్థానానికి చేరుకుంటుందా? లేదా? అన్న ఉత్కంఠ కొనసాగింది. అయితే తాజాగా వారాంతపు కలెక్షన్స్ ను పరిశీలించిన ట్రేడ్ పండితులు, ఇక ‘జనతా గ్యారేజ్’కు ఆ అవకాశం లేదని తేల్చేసారు. దీంతో ఆల్ టైం జాబితాలో ‘శ్రీమంతుడు’ రికార్డులు పదిలంగా ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.

నిజానికి ఏపీ, తెలంగాణాలలో పలు ప్రాంతాలలో ‘శ్రీమంతుడు’ రికార్డులను ‘జనతా గ్యారేజ్’ బద్దలు కొట్టినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కున్న మాస్ మార్కెట్ రీత్యా, బి, సి సెంటర్లుగా పరిగణించే రూరల్ ప్రాంతాలలో ‘శ్రీమంతుడు’ను దాటిందన్న రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే, ‘ఎ’ సెంటర్స్ లో మాత్రం, ‘గ్యారేజ్’ ఆ సత్తా చూపలేకపోయిందని, మొత్తమ్మీద మూడవ స్థానంతో సరిపెట్టుకోక తప్పదన్న ఫైనల్ సమాచారం అందుతోంది. అయితే ఓవర్సీస్ లో ఇంకాస్త ‘జనతా గ్యారేజ్’ వసూలు చేసినట్లయితే, ఆ అవకాశం దక్కి ఉండేదన్న విశ్లేషణలు వస్తున్నాయి.

ఈ ఏడాది ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఓవర్సీస్ లో 2 మిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ‘జనతా గ్యారేజ్’తో మాత్రం తన సినిమానే అందుకోలేకపోయారు. ఓవర్సీస్ లో ఫలితం మరింతగా ఉండి, 3 మిలియన్ క్లబ్ లోకి చేరినట్లయితే, జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులు ఆశించిన ఫలితం అంది ఉండేది. అయితే, గత 12 సంవత్సరాలుగా సరైన హిట్ లేని ‘బుడ్డోడు’ ఖాతాలో ‘జనతా గ్యారేజ్’ మాత్రం చెరిగిపోని ముద్ర వేసిందని చెప్పడంలో సందేహం లేదు.