Janasena to contest in Panchayath Elections 2019తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఈ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీనిపై పవన్ కళ్యాణ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ అభిప్రాయాలూ వెల్లడి అవుతున్నాయి.

ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో జనసేన ఏడు స్థానాల్లో పోటీ చేసింది. అయితే వీటిలో జనసేన కనీసం డిపాసిట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి ఉండదని సమాచారం. అయినా గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యడానికి ఇదే సరైన అవకాశమని పార్టీ భావిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చెయ్యడం అనేది అంత తేలికైన విషయం ఏమీ కాదు. సహజంగా ఈ ఎన్నికలలో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక తెలంగాణ విషయం అయితే చెప్పనే అక్కర్లేదు.

ఈ ఎన్నికలలో ప్రభావం చూపించే సత్తా అక్కడి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు కూడా కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితులలో జనసేన గనుక పోటీ చేసి ఘోరమైన ఫలితాలు గనుక రుచి చూస్తే అది ఇబ్బందే. ఈ ఎన్నికల ఫలితాలు కొంచెం అటూ ఇటూగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే వస్తాయి. రెండు ఎన్నికలలోను గనుక జనసేన సరిగ్గా ఫలితాలు రాబట్టకపోతే ఆ పార్టీ ఉనికికే ఇబ్బంది అవుతుంది. దీనితో పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించాలి.