Janasena to contest in mangalagiri against nara lokeshతెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఐటీ మంత్రి నారా లోకేశ్‌ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో జనసేన పోటీ చెయ్యకపోవడం తో విమర్శలు చెలరేగిన నేపధ్యంలో జనసేన చివరి నిముషంలో అక్కడ పోటీ పెట్టాలని నిర్ణయించింది. నేడు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది. జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు.

వైకాపా తరఫున సిట్టింగు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికలలో ఆయన కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు. జనసేన పార్టీ.. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్‌ స్థానాలను సీపీఐకి కేటాయించింది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంలోనూ సీపీఐకి జనసేన ఝలక్‌ ఇచ్చింది.

సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించి బీ-ఫారాన్ని ఇవ్వడంతో ఆ వామపక్ష పార్టీ ఖంగుతింది. టీడీపీ తొత్తుగా మారి వైకాపా పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇది నష్టనివారణ చర్యగా కనిపిస్తుంది. అయితే మంగళగిరిలో టీడీపీ, వైకాపా ప్రచారం దూసుకుపోతుంటే చివరి నిముషంలో బరిలోకి దిగిన జనసేన చాలా కష్టపడాల్సి వస్తుంది.