Janasena support to amaravati farmersఅమరావతి నుండి రాజధానిని తరలిస్తారని సాక్షాత్తు మంత్రులే వదంతులు వ్యాపింప చెయ్యడంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తమ భవిష్యత్తు పై అయోమయంతో ఉన్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రతిపక్ష పార్టీ నాయకులను కలిసి తమ గోడువెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణని కలిసిన వారు ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి తమను ఆదుకోమని ప్రాధేయపడ్డారు.

రాష్ట్ర శ్రేయస్సు కోసం తాము తమ భూములు త్యాగం చేస్తే… వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వారు వాపోయారు. రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్‌ను రైతులు కోరారు. దానితో ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. రాజధాని గ్రామాల్లోని రైతులను కలవనున్నారు. అలాగే అమరావతిలో నిలిచిపోయిన పనులను పరిశీలించనున్నారు.

“చాలా మంది రైతులు ఇష్టంతో, కొంతమంది తప్పక, కొంతమంది ఒత్తిడులు వల్ల భూములు ఇచ్చారు, ఇప్పుడు వారికి నష్టం జరగకూడదు. ఒక సారి రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని కోల్పోయి వచ్చాం, మళ్ళీ ఇంకోసారి రాజధాని నిర్మాణం ఆగిపోతే మన ఉనికిని కోల్పోతాం. రాజధాని నిర్మాణం ప్రభుత్వం మారగానే ఆపేస్తే అది అందరికీ నష్టం జరుగుతుంది. తొందరలో రాజధానిలో పర్యటిస్తా… రాజధాని అభివృద్ధి పనులు నాయకులు చెప్పింది కాకుండా, వాస్తవంగా ఏమి జరుగుతుందో స్వయంగా తెలుసుకుంటాను. ఎన్నికల తరువాత జనసేన జరిపే ప్రజాపోరాటాలు అమరావతి నుండి మొదలు పెట్టనుంది.