YS-Jagan-Flies-In-Helicopterఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేనలను తోడేళ్ళు, గుంట నక్కలు, రాక్షసులు, దోపిడీ దొంగలు అంటూ రకరకాలుగా శాపనార్ధాలు పెడుతుంటే, టిడిపి, జనసేనలు మాత్రం ఆయన విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు, ప్రవర్తన ఆధారంగా పేర్లు పెడుతూ ఘాటుగా జవాబు ఇస్తున్నాయి.

సిఎం జగన్మోహన్ రెడ్డి తరచూ హెలికాఫ్టర్లలో పర్యటిస్తుంటారు కనుక జనసేన పార్టీ ఆయనకు ‘హెలికాఫ్టర్‌ ముఖ్యమంత్రి’ అని మరో కొత్త పేరు పెట్టింది.

ఆదివారం రాత్రి తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, చక్రాయపాలెంలో ప్రజలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్ళి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ ‘హెలికాఫ్టర్‌ ముఖ్యమంత్రి’కి నేలపై నివసించే పేద ప్రజల కష్టాలు తెలియవంటూ వ్యంగ్యంగా అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని, కులాల వారీగా సమాజాన్ని చీల్చి వచ్చే ఎన్నికలలో ఓట్లు సంపాదించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

చివరికి పచ్చటి కోనసీమలో కూడా చిచ్చు పెట్టేందుకు వెనకాడలేదన్నారు. జగన్‌ మంత్రులకు పవన్‌ కళ్యాణ్‌ని బూతులు తిట్టడ్డం ఒక్కటే వచ్చు తప్ప రాష్ట్రాభివృద్ధి చేయడం చేతకాదని అందుకే తెలంగాణ కంటే ఆంద్రా చాలా వెనకబడిపోయిందని అన్నారు.

ఆత్మీయ సమ్మేళనంలో నాదెండ్ల మనోహర్‌ని ప్రజలు కూడా చాలా ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు, టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో కూడా ఇటువంటి ఆత్మీయ సన్నివేశాలే కనిపిస్తుంటాయి.

కానీ సంక్షేమ పధకాలకు బటన్ నొక్కి నిధుల విడుదల చేసేందుకు సిఎం జగన్‌ వచ్చినప్పుడు బలవంతంగా జనసమీకరణ చేయవలసివస్తోంది. ఆ సభకు రాకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామనో లేదా ఆ సమయంలో ఇళ్ళకి నీళ్ళు, విద్యుత్‌ సరఫరా నిలిపివేసో ప్రజలను బలవంతంగా సభకి తీసుకువస్తుంటారు. అలా బలవంతంగా తీసుకురాబడినవారు కూడా జగన్‌ ప్రసంగిస్తుండగానే గోడలు, గేట్లు దూకి పారిపోతుంటారు!

ఇక గడప గడపకి కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వచ్చినప్పుడు వారికి ఎక్కడికక్కడ ఛీత్కారాలు, నిలదీతలు ఎదుర్కొంటుండటం వార్తలలో అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ‘మేలు చేశామని’ కనుక ప్రజలందరూ మావెంటే ఉన్నారని జగన్‌ బటన్ నొక్కుడు సభల్లో గర్వంగా చెప్పుకొంటుంటారు.

కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. కనుక వైసీపీ అవునన్నా, కాదన్నా ప్రతిపక్ష నేతలకు అభిస్తున్న ఈ అపూర్వ ప్రజాధారణ చూస్తుంటే, వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయంగానే కనిపిస్తోంది.

Janasena satire on YS Jagan