Pawan Kalyan Vizag Policeవైసీపీ నేతల మాటలకి చేతలకి ఎక్కడా పొంతన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే తప్పక గెలుస్తామని వారి అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి బల్లగుద్ది చెపుతుంటారు. కానీ కేవలం 600 రైతులు అరసవిల్లి పాదయాత్రకు బయలుదేరితే వైసీపీ నేతలందరూ ఆందోళన చెందుతుంటారు.

వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు ఎక్కడ చేతులు కలుపుతాయో అనే భయం. ఆ రెండు పార్టీలతో బిజెపి చేతులు కలుపుతుందేమోనని మరో భయం. తమ ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను, అనాలోచిత నిర్ణయాలను గణాంకాలు, సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలను చూస్తే వైసీపీ నేతలకు భయం. ఎందుకంటే ఆ రెండు పత్రికలు ఎప్పుడు తమ బండారం బయటపెడతాయో అని!

సంక్షేమ పధకాలనే నమ్ముకొని వచ్చే ఎన్నికలలో మళ్ళీ అధికారంలోకి రావాలని, రాగలమని వైసీపీ భావిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. టిడిపి, జనసేనలను ప్రజలు ఛీ కొడుతున్నారని వైసీపీ నేతలు, వారి ఆత్మసాక్షి వాదిస్తుంటాయి. అయితే గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ఎటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయో వారికే బాగా తెలుసు.

విశాఖలో మళ్ళీ చక్రం తిప్పాలని తహతహలాడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి సొంత పార్టీలోనే వ్యతిరేకత సెగ తగులుతోందని ‘ఈనాడు’ బయటపెట్టినందుకు దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “మళ్ళీ ఏదో విదంగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసేందుకు రామోజీరావు విషం కలిపిన పంచదార గుళికలు ఈనాడు ద్వారా ప్రజలకు తినిపించేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ రాతలను ‘ఈనాడు’ ఎవరు పట్టించుకుంటారు? వృధా ప్రయాస తప్ప,” అంటూ ఈరోజు ట్వీట్ చేశారు.

ఒకవేళ ఈనాడు రాతలని ఎవరూ పట్టించుకోకపోతే వాటిని ఆయన మాత్రం పట్టించుకోవడం ఎందుకు? దానికి పోటీగా తానే స్వయంగా ఓ మీడియా సంస్థను ఏర్పాటుచేయడానికి సిద్దపడటానికి అర్దం ఏమిటి?ఒకవేళ ఈనాడు రాతలను ఎవరూ పట్టించుకోరనుకొంటే వైసీపీ ఆత్మసాక్షి రాతలను కూడా ప్రజలు పట్టించుకోరనగలరా?అంటే తాము, తమ మీడియా సత్యహరిశ్చంద్రుడి వారసులమని… నిజాలను నిర్భయంగా బయటపెడుతూ, తమని ప్రశ్నించేవారందరూ ద్రోహులు… రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తునవారని వైసీపీ భావిస్తున్నట్లు అర్దమవుతోంది.

తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల టిఆర్ఎస్‌కు నష్టం చేయలేదని భావిస్తున్నందునే ప్రభుత్వం, టిఆర్ఎస్‌ నేతలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. అదేవిదంగా ఏపీలో టిడిపి, జనసేనలకు అంత సీన్ లేదని వైసీపీ వాదిస్తున్నప్పుడు, పవన్‌ కళ్యాణ్‌ వైజాగ్ వస్తే ఆయన కార్యమాలను అడ్డుకోవడం దేనికి?అంటే పవన్‌ కళ్యాణ్‌కి లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ ఆందోళన చెందుతోందని అర్దం అవుతోంది. కనుక వైసీపీ నేతలకి వారి మాటలపై వారికే నమ్మకం లేదని, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా… రైతులు మొదలు మీడియాని, ప్రతిపక్ష పార్టీలను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేసే బదులు, అదేదో వారి మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధిపై పెడితే ఏమైనా ఫలితం ఉండేది కదా?

Watch and Subscribe for Exclusive Industry Interviews: