Pawan_Kalyan_Varahi_Vijayawada_Machilipatnamవైసీపీతో సహా ఏ రాజకీయపార్టీ అయినా ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకొంటుంది. జనసేన కూడా అలాగే అనుకొంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వచ్చారు. కానీ కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పట్టణంలో రోడ్లపై ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదని ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ వేలాదిగా తరలివచ్చిన జనసేన కార్యకర్తలతో కలిసి పవన్‌ కళ్యాణ్‌ తన వారాహి వాహనంలో మచిలీపట్నంలోని సభావేదిక వద్దకు ఊరేగింపుగా బయలుదేరారు. వందలాది మంది పోలీసులు కూడా ఆయన వెంటసాగుతున్నారు. వేలాదిగా తరలివచ్చిన జనసేన కార్యకర్తల ఉత్సాహం చూసి పోలీసులు పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుకొనే సాహసం చేయలేకపోయారు.

ఒకవేళ అడ్డుకొంటే వారి ఆగ్రహం తట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ వారాహి వాహనాన్ని స్వాధీనం చేసుకొంటే, పవన్‌ కళ్యాణ్‌ సభావేదిక వరకు పాదయాత్ర చేస్తారు. అప్పుడు జనసేన కార్యకర్తలను నిలువరించడం ఇంకా కష్టం అవుతుంది. కనుక పోలీసులు మౌనంగా పవన్‌ కళ్యాణ్‌ని అనుసరించక తప్పడం లేదు. అంటే తాము విధించిన ఆంక్షలను అమలుచేయలేని నిసహాయతలో ఉన్నారనుకోవచ్చు. ఇదివారికే అవమానం కదా?

వైసిపీ ప్లీనరీ నిర్వహించుకొంటున్నప్పుడు పోలీసులు వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తూ వారికి అన్నివిదాల సహకరించారు. జనసేన పోలీసుల నుంచి అంత సహకారం ఆశించడం లేదు కానీ సజావుగా తమ బహిరంగసభ నిర్వహించుకోనిస్తే చాలనుకొంటోంది. కనుక పోలీసులు జనసేనకు అవరోధాలు సృష్టించకుండా ఉంటే మరో 4-5 గంటల్లో బహిరంగసభ ముగించుకొని వెళ్ళిపోతారు కదా?

ఇక వారాహికి మిలటరీ రంగు వేశారని, దానిని ఏపీలో తిరుగనీయమని మంత్రులు, మాజీ మంత్రులు సవాళ్ళు విసిరిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వారి కళ్లెదుటే పవన్‌ కళ్యాణ్‌ తన వారాహిలో జనసేన కార్యకర్తలు వెంటరాగా మచిలీపట్నంకి వెళుతున్నారు. అంటే వారందరికీ పవన్‌ కళ్యాణ్‌ చెంపదెబ్బ కొట్టిన్నట్లు సమాధానం చెప్పిన్నట్లయ్యింది కదా?

అధికార, ప్రతిపక్షాల మదే విభేధాలు ఉండవచ్చు. పరస్పరం విమర్శించుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్నాము కదా అని రోడ్లపై ప్రతిపక్షాలను తిరగనీయమని అంటే ఇలాగే జరుగుతాయి.

ఇటువంటి ర్యాలీల కోసమే ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న వారాహి వాహనంపై పవన్‌ కళ్యాణ్‌ అటూ ఇటూ తిరుగుతూ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరికొద్ది సేపటిలో మచిలీపట్నంలోని సభావేదిక వద్దకు చేరుకోబోతున్నారు. పోలీసుల ఆంక్షలు, అవరోధాలు ఛేదించుకొని ముందుకు సాగగలుతున్నారు కనుక ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ సభలో ఏం చెప్పబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ సభలో టిడిపితో పొత్తుల గురించి పవన్‌ కళ్యాణ్‌ నిర్ధిష్టమైన ప్రకటన ఏమైనా చేస్తారా లేదా?అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రకటిస్తే రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోవడం ఖాయం.