JanaSena-Pawan-Kalyan-TDP-Chandrababu-Naiduవైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్ళుగా అమలుచేస్తున్న సంక్షేమ పధకాలపై సరికొత్త చర్చ మొదలైంది. వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులతో రాష్ట్రంలో దివాలా తీస్తున్నా రాబోయే ఎన్నికలలో వాటితోనే గట్టెక్కవచ్చానే గట్టి నమ్మకంతో సిఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందుకే “నేను ఇక్కడ బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తుంటాను… అక్కడ మీరు.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి వెళ్ళి ప్రజలకు ఆ విషయం గుర్తుచేస్తూ ఓట్లు సంపాదించుకోవాలని” హితబోధ చేస్తున్నారు. రాబోయే ఎన్నికలలో వాటితో వైసీపీ గట్టెక్కుతుందో లేదో తెలీదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు కూడా సంక్షేమ పధకాల కొనసాగింపుపై తమ వైఖరి ప్రకటించవలసి వస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల విజయనగరంలో పర్యటించినప్పుడు ప్రజలతో మాట్లాడుతూ, “వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలన్నీ యదాతధంగా అమలుచేస్తామని” చెప్పారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే మంచి సంక్షేమ పధకాలను అమలుచేస్తాము,” అని చెప్పాల్సి వచ్చింది.

పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అమలుచేయడం తప్పు కాదు కానీ రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రత్యేకంగా సంక్షేమ పధకాలను రూపొందించి అమలుచేయడం, వాటి కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయడాన్ని సమర్ధించలేము. కానీ సమర్ధించక తప్పని పరిస్థితి కల్పిస్తోంది వైసీపీ!

ఒకవేళ టిడిపి, జనసేనలు వాటిని కొనసాగించబోమని ఖరాఖండీగా చెపితే ఓడిపోవడం ఖాయం. అలాగని.. కొనసాగిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి గెలిస్తే తప్పనిసరిగా ఆ భారాన్ని తలకెత్తుకోవలసి ఉంటుంది. అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడే అవకాశం లేకుండాపోయే ప్రమాదం పొంచి ఉందన్నమాట! కనుక టిడిపి, జనసేనలు ఈ సంక్షేమ పధకాల హామీపై ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం.