JanaSena-Pawan-Kalyan-TDP-Chandrababu-Naiduటిడిపి-జనసేనలు పొత్తులు పెట్టుకోకుండా వాటిని దూరం చేయాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మొదట్లో వైసీపీ నేతల సవాళ్ళ ఉచ్చులో పవన్‌ కళ్యాణ్‌ చిక్కుకొని ఆవేశంగా ఏదో మాట్లాడినప్పటికీ, ఇప్పుడు ఎంత రెచ్చగొట్టినా ఏమాత్రం తొణకడం లేదు. ఆ ఉచ్చులో చిక్కుకొంటే టిడిపి-జనసేనలతో పాటు మరోసారి రాష్ట్రం కూడా నష్టపోతుందనే పవన్‌ కళ్యాణ్‌ బాగానే గ్రహించారు. అందుకే వైసీపీ సవాళ్ళకు ప్రతి సవాళ్ళు విసురుతున్నారే తప్ప పొత్తుల గురించి ఏమీ మాట్లాడటం లేదు.

అయితే టిడిపి-జనసేనలు కలిసి పనిచేయడం ఖాయమనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలతో వైసీపీకి కూడా అర్దమయ్యేలా చేశారు. బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ దానికి మద్దతు ప్రకటించలేదు. అలాగే బిజెపి కూడా జనసేన మద్దతు కోరలేదు. ఎన్నికల సమయంలో పొత్తులో ఉన్న రెండు పార్టీలు ఈవిదంగా వ్యవహరించడం అంటే వాటి మద్య బందం తెగిపోయిందనే అర్దం అవుతోంది.!

కనుక ఇక మిగిలింది టిడిపితో పొత్తులపై అధికారిక ప్రకటన. బహుశః మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించబోతున్న జనసేన ఆవిర్భావసభలో పవన్‌ కళ్యాణ్‌ దీనిపై స్పష్టత ఇస్తారేమో?దీని కోసం వైసీపీ నేతలు సైతం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మార్చి 12న పవన్‌ కళ్యాణ్‌ మంగళగిరి చేరుకొని, అక్కడ తన పార్టీ నేతలతో పార్టీ ఆవిర్భావసభ ఏర్పాట్లు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, వారాహిలో తన పర్యటన, బిజెపితో తెగతెంపులు, టిడిపితో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు, సభలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి చర్చించవచ్చు.

ఈ సభలో పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా టిడిపితో పొత్తులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే, చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాష్ట్రంలో పలు నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్ధులను ప్రకటించారు. దీంతో మిగిలిన నియోజకవర్గాలలో ఆశావాహులు టికెట్స్ కోసం ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు అభ్యర్ధులను ఖరారు చేసేక తర్వాత వారిని కాదనడం కష్టం. అలా చేస్తే టిడిపికి నష్టం కలుగుతుంది.

అయితే ఇప్పటికే రెండు పార్టీలు కలిసి పనిచేయడం ఖాయం అని స్పష్టమైంది కనుక ఏ నియోజకవర్గాలలో ఎవరు పోటీ చేయాలనే దానిపై చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల మద్య ఓ అవగాహన ఏర్పడే ఉంటుంది. కనుక పవన్‌ కళ్యాణ్‌ మార్చి 14న అధికారికంగా పొత్తులు ఖరారు చేస్తే, ఆ తర్వాత ఇరుపార్టీల నేతలు కూర్చొని సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించుకోవచ్చు.

అయితే బిజెపితో తెగతెంపులు చేసుకొన్నట్లయితే పవన్‌ కళ్యాణ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా లేదా ఏపీ రాజకీయ పరిస్థితులను దృష్ట్యా ఇది అనివార్యమని గ్రహించి, ఏపీ బిజెపి నేతలతో విమర్శలతో సరిపెడుతుందా?అనేది చూడాల్సి ఉంది.

ఇక మార్చి 14న టిడిపితో పొత్తులపై పవన్‌ కళ్యాణ్‌ అధికారిక ప్రకటన చేసినట్లయితే, వైసీపీ ప్రభుత్వం నుంచి జనసేన నేతలు, కార్యకర్తలపై ఒత్తిడి ఇంకా పెరిగిపోవచ్చు. బహుశః ఈ రెండు కారణాల చేతనే టిడిపి-జనసేనలు పొత్తులపై అధికారిక ప్రకటన చేసేందుకు తాత్సారం చేస్తున్నాయేమో?ఏది ఏమైనప్పటికీ మార్చి 14న టిడిపితో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతే అసలు కధలన్నీ మొదలవుతాయి. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోతాయి కూడా!