janasena pawan kalyan still sailing in two boatsపవన్‌ కళ్యాణ్‌ అటు సినిమాలలో, ఇటు జనసేనతో రాజకీయాలలో రెండు పడవలలో రెండు కాళ్ళుపెట్టి ప్రయాణిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ 2014, మార్చి 14వ తేదీన జనసేన పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. అంటే 8 ఏళ్ళుపైనే అయ్యిందన్న మాట! అప్పటికీ ఇప్పటికీ ఆయనలో రాజకీయ పరిణతి బాగా వచ్చింది. కానీ నేటికీ ఈ రెండు పడవల ప్రయాణం చేస్తుండటం వలననే మంత్రులు ఆర్‌కె. రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాద్ వంటివారు ఆయనని ‘వీకెండ్ పొలిటీషియన్’ అంటూ అవహేళన చేయగలుగుతున్నారు.

జనసేన పార్టీ నిర్వహణ ఖర్చుల కోసమే తాను సినిమాలలో నటించవలసి వస్తోందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొంటున్నారు. అది నిజం కూడా. అయితే ఈ రెండు పడవల ప్రయాణం వలన అటు ఒప్పుకొన్న సినిమాలకి సమయం కేటాయించలేకపోతున్నారు. ఇటు జనసేన పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు. అక్కడ సినిమా షూటింగ్ ఆలస్యమవుతున్నకొద్దీ నిర్మాణ వ్యయం పెరిగిపోతుంటుంది. నిర్మాతలు నష్టపోతుంటారు. ఆ కారణంగా సకాలంలో సినిమాలు రిలీజ్‌ చేయలేకపోతుంటే అభిమానులు బాధపడుతుంటారు.

ఇక పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం సినిమాలు చేసుకొంటుంటే పార్టీ వ్యవహారాలు, నిర్వహణ, రాష్ట్ర రాజకీయాలపై పూర్తి శ్రద్ద పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలనుకొంటున్నప్పుడు పార్టీని బూత్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు బలంగా నిర్మించుకోవాలి. నిత్యం ప్రజల మద్య ఉండాలి. ప్రజా సమస్యలపై పోరాడుతుండాలి.

జగన్మోహన్ రెడ్డి ఆవిదంగా పూర్తి సమయం పార్టీకి కేటాయించి, పార్టీని నిర్మించుకొని పాదయాత్రతో ప్రజల మద్యన ఉండటం వలననే ప్రజలు ఆయనను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చారని బహుశః పవన్‌ కళ్యాణ్‌కి తెలిసే ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలే జనసేన లక్ష్యం అనుకొంటే పూర్తి సమయం పార్టీకి, ప్రజలకి కేటాయించవలసిన అవసరం ఉంది.

కానీ రాజకీయాలు, సినిమాలు బ్యాలన్స్ చేసుకొంటూ సాగుదామని అనుకొంటే రెంటికీ న్యాయం చేయలేక ఎప్పటికీ ఇలాగే ఉండిపోవలసిరావచ్చు. అటు నమ్ముకొన్న నిర్మాతలకి, ఇటు నమ్ముకొన్న పార్టీ నేతలకి, కార్యకర్తలకి కూడా న్యాయం చేయలేకపోతే రెండువిదాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

టిడిపిలో చంద్రబాబు నాయుడు,నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు వంటి హేమాహేమీలైన నాయకులు అనేకమంది ఉన్నారు కనుకనే బాలకృష్ణ పార్టీకి, రాజకీయాలకి పూర్తి సమయం కేటాయించకపోయినా నడుస్తుంది. కానీ జనసేనలో అటువంటి నాయకులు ఎంత మంది ఉన్నారు?అని ప్రశ్నించుకొంటే నాదెండ్ల మనోహర్ ఒక్కరే కనిపిస్తారు. అంటే జనసేనలో నాయకులు ఉన్నప్పటికీ ప్రజలలో గుర్తింపు కలిగిన వారు లేరని అర్దమవుతోంది. కనుక పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులను హైలైట్ చేసుకోవడం చాలా అవసరం. అసలు పవన్‌ కళ్యాణ్‌ పార్టీ, సినిమాలలో ఏది ముఖ్యమో తేల్చుకోక తప్పదు. రెండు పడవల ప్రయాణంతో ఎవరూ ఎప్పటికీ తీరం చేరలేరని గ్రహిస్తే మంచిది.