Pawan_Kalyan_JanaSena_Machilipatnam_Meetingనిన్న మచిలీపట్నంలో జనసేన 10వ ఆవిర్భావసభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ సుదీర్గం ప్రసంగం చేశారు. కానీ టిడిపితో పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కానీ పొత్తులు ఉంటాయని సంకేతం ఇచ్చారు. రాష్ట్రంలో బిజెపి కలిసి రాకపోవడం వలన టిడిపితో కలిసి పనిచేయాలనుకొంటున్నానని చెప్పడం, టిడిపి, చంద్రబాబు నాయుడుపై ప్రత్యేకమైన ప్రేమ, ఆరాధన లేవని చెప్పుకోవడం వైసీపీకి సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లుంది. టిడిపితో సీట్ల సర్ధుబాట్లపై ఎటువంటి చర్చలు, ఒప్పందాలు జరగలేదని స్పష్టం చేశారు.

దమ్ముంటే జనసేన 175 సీట్లలో పోటీ చేయాలని వైసీపీ నేతలు ఎందుకు సవాళ్ళు విసురుతున్నారో, దాంతో వారు ఎటువంటి ఫలితం ఆశిస్తున్నారో తనకు తెలుసని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. కానీ తాను వారి ఉచ్చులో చిక్కుకోనని, వచ్చే ఎన్నికలలో ఎటువంటి రాజకీయ ప్రయోగాలు చేయబోనని, జనసేనను మరోసారి బలిపశువును కానీయనని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా చెప్పారు. ఇది వైసీపీకి జవాబని అర్దమవుతోంది. కానీ ఇంతకంటే టిడిపితో జనసేన పొత్తులు పెట్టుకొంతుందని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా ప్రకటించి ఉండి ఉంటే, రెండు పార్టీల మద్య ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సహృద్భావ వాతావరణం ఏర్పడి ఉండేది. అయితే ఇప్పుడే చెప్పేస్తే వైసీపీ, బిజెపిలతో కొత్త చిక్కులు ఎదుర్కోవలసి వస్తుందని ఆగి ఉండవచ్చు.

జనసేన తప్పక గెలిచి అధికారంలోకి రాగలదని నమ్మకం కలిగితే ఒంటరిగానే పోటీ చేసేందుకు వెనుకాడబోమని చెప్పడం, ఎప్పటికైనా రాష్ట్రంలో జనసేన సొంతంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉందని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరిచేందుకే అని భావించవచ్చు. కానీ టిడిపితో పొత్తుల గురించి ఆలోచిస్తూ, ఈవిదంగా మాట్లాడటం వలన జనసేనపై ప్రజలలో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. లేదా అపనమ్మకం కలిగేలా చేసేందుకు వైసీపీకి అవకాశం కల్పించిన్నట్లవుతుందని చెప్పవచ్చు.

తాను కుల రాజకీయాలు చేయాలనుకోవడం లేదని కానీ రాష్ట్ర రాజకీయాలలో కులప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున తప్పనిసరి కులాల గురించి మాట్లాడవలసివస్తోందన్నారు. కాపు కులంలో పుట్టాను కనుక వారి మద్దతు కోరుతున్నానని అన్నారు. అయితే ఏ ఒక్క కులానికో అధికారం కట్టబెట్టేందుకు తాను పోరాడటం లేదని చెప్పారు.

ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తున్నట్లయితే ఈవిదంగా మాట్లాడవచ్చు. కానీ టిడిపితో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నందున, కాపులకు, తనకు మద్దతు ఇస్తున్న ఇతర కులాలకు మరింత మేలు కలిగేలా చేస్తానని పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చి ఉంటే మరింత అర్దవంతంగా ఉండేది. ముఖ్యంగా కాపు ఓట్లను టిడిపికి తాకట్టు పెట్టేందుకు పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారనే వైసీపీ ఆరోపణలకు సమాధానం చెప్పిన్నట్లు ఉండేది.

పవన్‌ కళ్యాణ్‌ తన ప్రసంగంలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. ఈసారి ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనేది ముఖ్యం కాదని పోటీ చేసిన అన్ని స్థానాలలో తప్పకుండా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలనేదే తన లక్ష్యమని చెప్పారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ‘కుల విభజన’ చేస్తోందని కానీ దాని నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అన్ని కులాలవారు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తనకు గజమాలలు వేసి, చప్పట్లు కొడుతున్నవారు ఈసారి ఓట్లు కూడా వేసి ఆశీర్వదిస్తే రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.