Pawan-Kalyan-Jagan-ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల వాస్తవ పరిస్థితి ఏవిదంగా ఉందో సిఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు శుక్రవారం నుంచి #గుడ్ మార్నింగ్ సిఎం సర్‌ పేరుతో మూడు రోజులు ఫోటోలు, వీడియోలతో కూడిన డిజిటల్ క్యాంపెయినింగ్ మొదలుపెడతామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర తెలిపారు. కానీ ఒక రోజు ముందుగానే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ చక్కటి కార్టూన్‌తో ‘పని’ ప్రారంభించేశారు.

ఈరోజు ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆ కార్టూన్‌లో సిఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో ఎక్కడికో బయలుదేరుతుండగా ఓ అధికారి పరుగున వచ్చి మొబైల్ ఫోన్‌లో వచ్చిన విజ్ఞప్తిని వినిపించగా జగన్ ఆశ్చర్యపోయినట్లు చూస్తారు. అప్పుడు ఆ అధికారి “అదే సార్, రోడ్లంటే సైకిళ్ళు, బైకులు, బండ్లు, బసులు, కార్లు నడుపుతారే అవన్నమాట! మానమెప్పుడూ హెలికాప్టర్‌లోనే వెళ్తాం కదా, మానకవి పెద్దగా గుర్తుండవు, పట్టించుకోం!!” అని చెపుతున్నట్లు కార్టూన్ షేర్ చేశారు.

జనసేనకు పోటీగా టిడిపి కూడా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులను తెలియజేసే ఫోటోలు, వీడియోలు పంపించాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలను కోరింది. వాటిని టిడిపి సోషల్ మీడియా ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళదామని చెప్పింది.

ఓ పక్క జనసేన, టిడిపిలు ఈవిదంగా వాయించేస్తుంటే మరో పక్క మీడియాలో కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిని తెలియజేస్తూ ఫోటోలు, వీడియోలు వస్తుండటంతో వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరికీ ఏవిదంగా జవాబు చెప్పి నోళ్ళు మూయించాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు. నేడో రేపో ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని రోడ్ల పరిస్థితులతో పోల్చుతూ వాటికంటే మన రాష్ట్రంలోనే రోడ్లు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవడం మినహా మరో దారిలేదు వారికి!