JanaSena-Pawan-Kalyan-Narendra-Modi-YSRCPప్రధాని నరేంద్రమోడీ విశాఖ వచ్చినప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని పిలిపించుకొని మాట్లాడటంతో వారిద్దరూ దేనిగురించి చర్చించారని వైసీపీ నేతలు ఒకటే టెన్షన్ పడిపోతున్నారు. ఏదో విదంగా పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టి ఆయన నోటితోనే ఆ విషయం చెప్పించాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ పవన్‌ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడితే ఆయనను పక్కన పెట్టేశారని మంత్రి రోజా వాదన చాలా హాస్యాస్పదంగా ఉంది. సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీని రాష్ట్రం కోసం చాలా అడిగారు కానీ పవన్‌ కళ్యాణ్‌ ఏమడిగారు? అంటూ మంత్రులు ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడుని ప్రధాని నరేంద్రమోడీని కలిపేందుకే పవన్‌ కళ్యాణ్‌ ప్రయత్నించారంటూ వైసీపీ నేతల వాదనలు వారి ఆతృతకు అద్దంపడుతున్నాయి.

అయితే ప్రధాని నరేంద్రమోడీతో భేటీ ముగియగానే పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించానని, తమ భేటీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. నిన్న ప్రధాని నరేంద్రమోడీని ప్రశంశిస్తూ మాట్లాడారు. అది కాస్త అసందర్భంగా ఉన్నట్లు అనిపించినా ఆయనతో సఖ్యతగానే ఉండాలని కోరుకొంటున్నట్లు చెప్పినట్లు భావించవచ్చు. ఇది వైసీపీ జీర్ణించుకోవడం కష్టమే. బహుశః వైసీపీ కోసమే పవన్‌ కళ్యాణ్‌ ఆవిదంగా మాట్లాడి ఉండవచ్చు.

ఇక విజయనగరంలో పర్యటించి అక్కడ జగనన్న ఇళ్ళని పరిశీలించినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ‘తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పేదల ఇళ్ళకు ఉచితంగా ఇసుక ఇస్తానని ‘చెప్పడం, ఆ తర్వాత ట్విట్టర్‌లో జనసేనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ సందేశం పెట్టడం గమనిస్తే వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు అర్దమవుతుంది. అంటే ప్రధాని నరేంద్రమోడీతో భేటీలో బహుశః బిజెపి-జనసేన, టిడిపి-జనసేన, టిడిపి-జనసేన-బిజెపిల పొత్తులపై చర్చ జరిగినట్లు అర్దమవుతోంది. జనసేనను బిజెపిలో విలీనం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ పవన్‌ కళ్యాణ్‌ అడిగారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు వాటిలో ఎంతో కొంత నిజముండవచ్చు.

కనుక టిడిపి-జనసేన-బిజెపిల పొత్తులకు ప్రధాని నరేంద్రమోడీ అంగీకరించనందున లేదా జనసేనను బిజెపిలో విలీనం చేయాలని కోరడం వలననే పవన్‌ కళ్యాణ్‌ బిజెపిని విడిచిపెట్టి ఒంటరి పోరాటం చేయడానికి సిద్దపడినట్లు అర్దమవుతోంది. ‘తాను ముఖ్యమంత్రి అయితే ఫలానా ఫైలు మీద సంతకం చేస్తానని’ పవన్‌ కళ్యాణ్‌‌ చెప్పడానికి అదే అర్దంగా కనిపిస్తోంది.

అయితే పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటికైనా చంద్రబాబు నాయుడుతో చేతులు కలుపుతారని, టిడిపి-జనసేనలు కలిసి పోటీ చేస్తాయనే వైసీపీ నేతల నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకపోవచ్చు. ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కనుక పొత్తుల గురించి తర్వాత తాపీగా ఆలోచించుకోవచ్చునని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తున్నారేమో? వైసీపీకి ఆ మాత్రం సస్పెన్స్ అవసరం కూడా!