janasena-pawan-kalyan-meeting-with-bc-leaders-mangalagiriజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీలు, తూర్పు కాపుల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా స్పూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.

“రాష్ట్రంలో తూర్పు కాపులతో సహా బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ‘ఓట్లు మావి… అధికారం మీది’ అన్నట్లుగానే ఉండిపోయారు. ఈ కులాల దన్నుతో కొంతమంది నాయకులు రాజకీయంగా చాలా ఎదిగారు. చాలా సంతోషమే. కానీ వారు ఒక్కరే ఎదగడం కాదు కులంలో ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చగలిగినప్పుడే ప్రయోజనం ఉంటుంది. కానీ ఆవిదంగా జరగడం లేదు. సంఖ్యా బలం ఎక్కువగా ఉన్నప్పటికీ ఏదో ఓ కులానికి చెందిన పెద్ద నాయకుడు చెప్పినట్లు ఓట్లు వేసి గెలిపించేయడంతో మీ బాధ్యత తీరిపోతుందని కాకుండా మీరందరూ కలిసి ఓ 10-15 మంది ముఖ్య నాయకులను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి. వారి ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కరించుకొనే అవకాశం ఏర్పడుతుంది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితులలో మీ ఓట్లన్నీ చీలిపోకుండా మీ ప్రతినిధులుగా ముందుకు తీసుకువచ్చినవారికే వేయండి. అప్పుడు అత్యధిక సంఖ్యలో బీసీలు అధికారంలోకి రాగలుగుతారు. మీ సమస్యలన్నీ సులువుగా పరిష్కారం అవడమే కాకుండా ‘దేహీ..’ అని ఎవరినీ చేయి జాపి అడగాల్సిన అవసరం ఉండదు. మనం ఎప్పుడూ మన సమస్యలను ఎవరో ఒకరికి మొర పెట్టుకొని పరిష్కరించాలని వేడుకొనే పరిస్థితి నుంచి బయటపడి మనమే మన సమస్యలను పరిష్కరించుకొనే స్థాయికి ఎదగాలని కోరుకొంటున్నాను.

నేను మిమ్మల్ని జనసేనకే ఓట్లు వేయమని అడగటం లేదు. మీకు ఎవరు మేలు చేస్తారని నమ్మకం కలిగితే ఆ పార్టీకే వేయండి కానీ ఎట్టి పరిస్థితులలో మీ ఓట్లు చీలిపోకుండా మీరు ముందుకు తీసుకువచ్చిన ప్రతీధులకు మాత్రమే ఓట్లేసి గెలిపించండని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఒక్క పనీ చేయగలిగితే మరో 30 ఏళ్ళ వరకు బీసీల చేతుల్లోనే రాజ్యాధికారం ఉంటుంది.

నేను మీ అందరి నమ్మకం పొందేందుకు నాకు పదేళ్ళు పట్టింది. కనుక మీరు నన్ను, జనసేన పార్టీని నమ్మినట్లయితే ఓట్లు వేయండి. మాతో కలిసి రాజ్యాధికారం పంచుకోండి. మీరు మాకు అధికారం ఇస్తే ఇప్పుడు మీరు చెపుతున్న ఈ సమస్యలన్నిటినీ తప్పకుండా పరిష్కరిస్తాను. ఒకవేళ పరిష్కరించకపోతే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు నా చొక్కా పట్టుకొని అడగండి. ఆ హక్కు మీకుటుంది.

ఇక ఓబీసీల రిజర్వేషన్లు కేవలం మూడు జిల్లాలకే ప్రభుత్వం పరిమితం చేసిందని మీరు చెపుతుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉండగా కేవలం మూడింటికే ఎందుకు పరిమితం చేశారు? అంటే మిగిలిన జిల్లాలో ఓబీసీలు లేరని ప్రభుత్వం భావిస్తోందా?

ఇక ఉత్తరాంద్ర జిల్లాల వెనకబాటుతనం, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పరిశ్రమలు లేకపోవడానికి, రాకపోవడానికి, ఉన్నవి మూసుకుపోవడానికి గల కారణాలు తెలుసుకొనేందుకే నేను నాదెండ్ల మనోహర్ గారిని విజయనగరం జిల్లాకు పంపించాను. అక్కడ ఆయన అన్ని సమస్యలపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తే దానిని బట్టి మేము ముందుకు వెళ్దామని నిర్ణయించుకొన్నాను,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.