Pawan-Kalyan-Ippatam-Village-Visitమంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో టిడిపి, జనసేనలకు మద్దతు ఇస్తున్నవారి 53 ఇళ్ళు, ప్రహారీగోడలను నిన్న రెవెన్యూ, మునిసిపల్ అధికారులు జేసీబీలతో కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకొన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌‌ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకొని నేరుగా ఇప్పటం గ్రామానికి కారులో బయలుదేరారు. కానీ దారిలో పోలీసులు ఆయన కారును అడ్డుకోవడంతో పవన్‌ కళ్యాణ్‌ కారుదిగి వారికి నమస్కరించి నడుచుకొంటూ ముందుకు సాగేసరికి పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు.

అప్పటికే భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకొని, పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుకొంటున్నందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పవన్‌ కళ్యాణ్‌ వారిని వారించి, “పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు. వారూ మన సోదరులే. కనుక వారితో గొడవడొద్దు. వారు అడ్డుకొంటే ఓ దణ్ణం పెట్టి చేతులు కట్టుకొని ముందుకు సాగండి,” అంటూ హితవు పలికారు.

పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు ఇప్పటం గ్రామంలో పర్యటించబోతున్నారని తెలియగానే, ఆయన కూల్చివేసిన ఆ ఇళ్ళవైపు వెళ్ళకుండా అడ్డుకొనేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు వేశారు. ఇప్పటం గ్రామంలో వందలాదిమంది పోలీసులను మోహరించి గ్రామస్తులు ఎవరూ పవన్‌ కళ్యాణ్‌తో భేటీ కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ గ్రామంలో ప్రవేశించగానే గ్రామస్తులు ‘పవన్‌ కళ్యాణ్‌ జిందాబాద్…’ అని నినాదాలు చేస్తూ ఆయనని కలిశారు. పవన్‌ కళ్యాణ్‌ వారితో కలిసి ఆ ముళ్ళ కంచెలు దాటుకొని కూల్చివేసిన ఇళ్ళన్నిటినీ సందర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటం ఓ చిన్న గ్రామం. ఇదేమీ రాజమండ్రి లేదా కాకినాడ నగరం కాదు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్న పెదకాకానిలో రోడ్ల విస్తరణ చేయరు కానీ మారుమూల ఉన్న ఈ గ్రామంలో రోడ్లు విస్తరణ చేస్తారా?అయినా రోడ్ల మీద గుంతలు పూడ్చలేకపోతున్న ప్రభుత్వం రోడ్లు విస్తరణ చేస్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటం గ్రామస్తులు జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్ళు కూల్చివేశారని అందరికీ తెలుసు. మీ రాజకీయ కక్షల కోసం నిరుపేదలు వారి జీవితకాలం శ్రమించి కట్టుకొన్న ఇళ్ళను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు. మా ప్రజల ఇళ్లను కూల్చివేసిన మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అత్యాచారాలు, భూకబ్జాలు చేస్తున్నవారిని పోలీసులు పట్టించుకోకుండా ఇళ్ళు కూలిపోయిన బాధితులను పరామర్శించడానికి వస్తున్న మమ్మల్ని అడ్డుకొంటారా?ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా అసలు? పోలీసులు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు వారి కష్టాలు మాకు తెలుసు కనుక నేను వారిని తప్పు పట్టడం లేదు. కానీ పోలీసులతో మమ్మల్ని బెదిరించాలని, అరెస్టులు చేయాలని ప్రయత్నిస్తే భయపడేది లేదు. మేమందరం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్దం. ఇళ్ళు కోల్పోయినవారందరికీ జనసేన అండగా ఉంటుంది,” అని అన్నారు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఇంకా ఇప్పటం గ్రామంలోనే పర్యటిస్తున్నారు. తర్వాత మంగళగిరిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు.