జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)ని రద్దు చేస్తానని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రికాగానే సంతకం చేసే రెండో ఫైల్ అదే అని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న ఇళ్ళను పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ “జగనన్న ఇళ్ళ పేరుతో వైసీపీ నేతలు జేబులు నింపుకోవడానికి తప్ప పేద ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఈ ఇళ్ళ నిర్మాణంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నేను ప్రధాని నరేంద్రమోడీకి నేరుగా నివేదిక అందజేస్తాను. వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలని మభ్యపెడుతోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదల ఇళ్ళ నిర్మాణాలకి అవసరమైన ఇసుక ఉచితంగా అందజేస్తాం. ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పధకాలను కూడా కొనసాగిస్తాము,” అని అన్నారు.
Also Read – మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!
జనసేన ఓ రాజకీయ పార్టీ కనుక తాము అధికారంలో రాగానే ఫలానా ఫలానా పనులు చేస్తామని చెప్పుకోవడం తప్పు కాదు. అలాగే తాను ముఖ్యమంత్రికాగానే ఫలానా ఫైలుపై తొలి సంతకం, ఫలానా ఫైలుపై రెండో సంతకం చేస్తానని చెప్పుకోవడం కూడా తప్పు కాదు. అయితే అది జనసేన ఒంటరిగా 175 స్థానాలకు ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నప్పుడు మాత్రమే చెప్పాల్సిన మాట!
ప్రస్తుతం జనసేన బిజెపితో పొత్తు పెట్టుకొంది. కనుక వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయనుకొంటే రెండు పార్టీలు చర్చించుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇటువంటి హామీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ‘మా కూటమి మా ముఖ్యమంత్రి అభ్యర్ధి పవన్ కళ్యాణ్’ అని బిజెపి నేతల చేత ప్రకటింపజేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా?
Also Read – కాంగ్రెస్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలదా?
ఒకవేళ జనసేన బిజెపిని వదిలి లేదా దాంతో కలిసి టిడిపితో పొత్తులు పెట్టుకొన్నా కూడా ఇవే నిబందనలు వర్తిస్తాయి. అప్పుడు టిడిపి ఎక్కువ స్థానాలలో పోటీ చేయడం ఖాయం. ఒకవేళ వారి కూటమి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి పదవి టిడిపికే దక్కుతుంది తప్ప పవన్ కళ్యాణ్‌కి రాదు. వస్తుందనుకొంటే చంద్రబాబు చేత ఆ మాట చెప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ వారి కూటమి అధికారంలోకి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఈ హామీలను నెరవేర్చమని టిడిపిపై ఒత్తిడి చేయగలరేమో కానీ అమలుచేయించలేరు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇస్తున్న హామీలని నీటి మీద్ రాతలే అనుకోవవాలసి ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికో లేదా జనసేన తప్పకుండా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి కూడా నమ్మకం కలిగించడానికో పవన్ కళ్యాణ్ ఇటువంటి హామీలు ప్రకటిస్తున్నప్పటికీ, అవే ఆయన విశ్వసనీయతను దెబ్బతీయవచ్చు. కనుక ముందుగా ఆయన ఏ పార్టీతో పొత్తులు కొనసాగిస్తారు?ఆ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?వచ్చే ఎన్నికలలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది?అనే మూడు ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఆయన మాటలకు విలువ ఉంటుంది లేకుంటే జనసేన ఇంకా అయోమయంలోనే ఉన్నట్లు ప్రజలు భావిస్తే ఆ పార్టీయే నష్టపోతుంది.