Pawan-Kalyan-Challenges-YSRCPజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమంటూ శపధం చేశారు. కానీ వైసీపీని అడ్డుకోవడం కోసం తాను కేంద్రం సాయం కోరబోనని, ఎందుకంటే ఈ రాష్ట్రం తనది కనుక తానే పోరాడి వైసీపీ కబంద హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడిపించుకొంటానని అన్నారు.

ఇప్పుడు ఇప్పటంలో ఏ సాకుతో గ్రామస్తుల ఇళ్ళు కూల్చివేశారో రేపు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సాకుతో వైసీపీ ఎమ్మెల్యేల ఇళ్ళు కూడా కూల్చివేసి బుద్ది చెపుతానని అన్నారు. ఇప్పుడు పిచ్చిపిచ్చిగా వాగుతున్నవారికి, దౌర్జన్యాలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన విదంగా బుద్ది చెపుతుందని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు.

అనంతపురం జిల్లాకి చెందిన ఓ వైసీపీ నేత తాము తలుచుకొంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఆయన ఇంట్లోనే హత్య చేయించి ఉండేవారిమని, హత్యా రాజకీయాలు చేయాలనుకొంటే నారా లోకేష్‌ తమ మొట్ట మొదటి టార్గెట్ అని జంకూగోంకూ లేకుండా చెప్పడం గమనిస్తే వైసీపీ ఓ రాజకీయపార్టీ ముసుగులో ఉన్న ఉగ్రవాద సంస్థలా వ్యవహరిస్తోందని అన్నారు. ఆ ఉగ్రవాద పార్టీకి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారని పవన్‌ కళ్యాణ్‌ ఆక్షేపించారు.

వైసీపీని ఎదిరిస్తున్న కారణంగానే తమ పార్టీని రౌడీసేన అని అంటున్నారని, కానీ ఓ ఉగ్రవాద పార్టీని ఎదుర్కొని పోరాడుతున్న తమ జనసేన పార్టీని విప్లవ పార్టీగా పవన్‌ కళ్యాణ్‌ అభివర్ణించుకొన్నారు.

వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు నుంచి ఇసుక తవ్వుకుపోవడం వలననే ఆ ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోయిందని ఆరోపించారు. డబ్బు, అధికారం, పదవుల దురహంకారంతో విర్రవీగే రాజకీయనాయకుల రాజ్యం పోయి బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కాలని తాను కోరుకొంటున్నానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ ఇంతకాలం వైసీపీ విషయంలో చాలా సంయమనంగా వ్యవహరిస్తుండేవారు. కానీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇదే మొదటిసారి. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతల ఇళ్ళు కూల్చివేయిస్తానని హెచ్చరించడం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఓ ఉగ్రవాద పార్టీగా అభివర్ణించడం మామూలు విషయమేమీ కాదు.

విశాఖలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ తర్వాతే పవన్‌ కళ్యాణ్‌లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనబడుతోంది. అంటే ప్రధాని మోడీ ఆయనకు రాజకీయాలలో ఏవిదంగా ముందుకు సాగాలో బహుశః దిశానిర్దేశం చేసి ఉండవచ్చు. వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాల పట్ల ప్రజలలో గూడుకట్టుకొని ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని జనసేన పార్టీ ఆయుధంగా మలుచుకొని పోరాడాలని ప్రధాని మోడీ సూచించి ఉండవచ్చు. ‘జనసేన కూడా’ రాష్ట్రంలో వైసీపీకి బలమైన ప్రత్యామ్నాయమనే బలమైన సంకేతాలు పంపుతున్నారు. రాష్ట్రంలో జనసేన అధికారంలోకి రావడానికి అన్ని విదాలా తోడ్పడుతామని బహుశః ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారేమో?లేకుంటే పవన్‌ కళ్యాణ్‌ ఇంత ధీమాగా, ఇంత నమ్మకంగా చెప్పగలిగి ఉండేవారే కారు. బహుశః అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీలో అందరూ పవన్‌ కళ్యాణ్‌ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నట్లున్నారు.

అయితే ఏపీలో చాలా బలంగా వైసీపీ, టిడిపిల ధాటిని తట్టుకొని వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ విజయం సాధించడం అంత సులువుకాదు. బహుశః అందుకే వచ్చే ఎన్నికలతో పాటు ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికలకు కూడా దీర్గకాలిక ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నామని పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్లు భావించవచ్చు.