Janasena - Pawan Kalyan Anantpur Candidate Selectionsపదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వంటి పరీక్షల కాలం ముగిసిన, రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్న తరుణంలో… ‘జనసేన’ పరీక్షల కాలం మొదలు కాబోతోంది. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి కాకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. తొలివిడతగా అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత ‘అర్హత పరీక్ష’లను నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ‘జనసేన’ లెటర్ హెడ్ పై వివరిస్తూ పత్రికా ప్రకటన కూడా వెలువడింది.

వారసత్వ రాజకీయ సిద్ధాంతాలకు విరుద్ధంగా ‘జనసేన’ వెళ్ళబోతుందని స్పష్టం చేస్తూ… అనంతపురం జిల్లాకు గానూ 3600 దరఖాస్తులు రావడంతో, వీరిని ఎంపిక చేసేందుకు మూడు రోజుల పాటు అర్హత పరీక్షల పేరిట నిస్పక్షపాతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నామని, ప్రతిభకు పట్టం కట్టబోతున్నామని పార్టీ అధినేత స్పష్టం చేసారు. ఎంపికైన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలపడంతో ఈ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

అయితే ఎవరిని ఎంపిక చేసినా గానీ, రొటీన్ రాజకీయాలకు భిన్నంగా ‘జనసేన’ ఆలోచిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇదే సమయంలో దీనిని ఎంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు? అనేది కూడా పవన్ కళ్యాణ్ పై ఆధారపడి ఉంది. ఏదైనా కొత్త ఒరవడితో చేయాలన్న ఆలోచనలు రావడం కంటే కూడా, వాటిని ఎంత సక్రమంగా అమలు చేయగలిగాము అన్నదే రాజకీయాలలో కీలకమైన అంశం. ఈ మెట్టును సక్సెస్ ఫుల్ గా ఎక్కగలిగితే, పార్టీ సంస్థాగతంగా క్యాడర్ ను సంపాదించుకోగలుగుతుంది.