JanaSena Party - YSRCP - supports -TRSఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన వాగ్దానానికి తాము కట్టుబడి ఉన్నామని సోనియా గాంధీ ప్రకటించడంతో తెరాస నాయకులు దానిని వాడుకుని తెరాసను టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని తెలంగాణాలో ప్రకటించడం ఏంటి? తెలంగాణలోని పరిశ్రమలను ఆంధ్రకు తరలించుకుని పోతారా అంటూ తెరాస నాయకులు కాంగ్రెస్ మీద విరుచుకుపడుతున్నారు. ఈ మేరకు ఆ అంశంపై తెరాస తన స్టాండును చెప్పకనే చెప్పింది.

మరోవైపు ఆంధ్రాలో ప్రత్యేక హోదా అనేది కీలక అంశంగా మారింది. ఇప్పటికే దీనికోసం టీడీపీ బీజేపీకి తలాక్ చెప్పి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ వైపుగా వెళ్తుంది. గతంలో ఓ సారి పార్లమెంట్ లో కవిత ఏపీ ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాట్లాడారని ఆమెను చెల్లెమ్మ అని సంబోధిస్తూ ధన్యవాదాలు చెప్పారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు తెరాస మాట మార్చినా పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు. అటు జగన్ కూడా ఈ విషయం తనకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహారిస్తున్నారు.

అది ఇలా ఉండగా ఆ పార్టీ వారు తెలంగాణాలో తెరాసతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఏకంగా మీటింగులు పెట్టి తెరాసని గెలిపించాలని తీర్మానాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే తెరాస అభిమానుల కంటే వైకాపా, జనసేన అభిమానులే కారు పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ఓటమే మా లక్ష్యం అంటూ తెరాసకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు పని చేస్తాం ఏపీ ఎన్నికలప్పుడు మాకు పని చెయ్యండి అంటూ క్విడ్ ప్రో కో కు పాల్పడుతున్నారు.

సరే శత్రువుకు శత్రువు మిత్రుడు అవ్వడం అనేది సహజం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కు సంజీవని అని వీరే చెబుతున్న ప్రత్యేక హోదాను వ్యతిరేకించే పార్టీతో అంటకాగడం ఎంత వరకూ న్యాయమో వారికే తెలియాలి. అసలు ఇటువంటి అనైతిక చీకటి పొత్తులను ప్రజలు హర్షిస్తారా? మళ్ళీ ఇదే పార్టీ నాయకులు ప్రత్యేక హోదా అంటూ రోడ్లు ఎక్కుతారు. రాష్ట్ర ప్రయోజనాలకు నిలబడలేని పార్టీలు రేపు తమను గద్దెనెక్కించమని ప్రజలు ఎలా కోరగల్గుతాయి. ప్రజలు కళ్ళు చెవులు లేవని అనుకుంటున్నారా?