janasena-party-post-andhra-pradesh-electionsఆంధ్రప్రదేశ్ పోలింగ్ ముగిసిన దాదాపు 10రోజుల తర్వాత నిన్న జనసేన పార్టీ మొదటి సమావేశం జరిపిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. తొలి విడత సమీక్షలో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

అయితే వరుసగా జరగాల్సిన ఈ సమీక్షలకు బ్రేక్ పడిందని సమాచారం. దీనికి కారణం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులలో సగం మంది కూడా మొదటి సమీక్షకు హాజరు కాకపోవడమే. నరసాపురం నుండి పోటీ చేసిన నాగబాబు సైతం హాజరు కాలేదు. దీనితో అందుబాటులో ఉన్న అభ్యర్ధులతోనే సమీక్షా సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు రాకపోవడానికి కారణం తొందరలో రాబోతున్న వ్యతిరేక ఫలితాలే అని ఆ పార్టీ అంతరంగికంగా అంచనా వేస్తుంది.

పార్టీ ఎంతో కొంత బలంగా ఉండే జిల్లాలలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన జిల్లాల గురించి మాట్లాడాల్సిన పని లేదు. దీనితో ఈ సమావేశాలకు బ్రేక్ ఇచ్చారు. ముందస్తు సమాచారం లేకుండా సమావేశం పెట్టడం వల్లే హాజరు సరిగ్గా లేదని నాయకలు మీడియా వారితో సర్ది చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో ఫలితాలకు ముందే ఇటువంటి నిర్లిప్తత ఉంటే కౌటింగ్ రోజు ప్రమాదం అని భావిస్తున్నారు. పార్టీలో ఏదో ఒకటి జరుగుతుంది అని ప్రజలకు తెలిసేలా రోజూ ఎవరో ఒకరు ఏదో ఒక విషయంగా మీడియాతో మాట్లాడాలని నిర్ణయించారు. అయితే పవన్ కళ్యాణ్, నాదెండ్ల, జేపీ లక్ష్మీనారాయణ, నాగబాబు తప్ప పార్టీలో పెద్దగా తెలిసిన మొఖాలు లేకపోవడం ఇంకో మైనస్ అనే చెప్పుకోవాలి.