JanaSena-Party-Pawan-Kalyan-V-V-Lakshminarayanaవిశాఖపట్నం పార్లమెంట్ కు జనసేన తరపున పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గణనీయమైన ఓట్లు సాధించారు. గాజువాక నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఓట్ల కంటే లక్ష్మీనారాయణకు వచ్చిన ఓట్లు అధికం. ఎన్నికలలో ఘోరపరాజయం తరువాత జనసేన నేతల్లో ఎవరైనా ప్రజల్లో కాస్తో కూస్తో యాక్టీవ్ గా ఉన్నారంటే అది ఆయనే. అటువంటిది ఆయనను జనసేన పార్టీ పక్కన పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. జనసేనపార్టీ కమిటీలను పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన పొలిట్‌ బ్యూరో లో గానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ లో గానీ ఆయనకు చోటు దక్కలేదు.

మాజీ గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సమయంలోనూ, కొత్త గవర్నర్ ను కలిసిన సమయంలోనూ పవన్ కళ్యాణ్ వెంట ఆయన లేరు. పైగా పార్టీలోనే ఉండి గందరగోళం సృష్టిస్తోన్న వారు, ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్న వారిని పక్కన పెడతాం అంటూ పవన్ కళ్యాణ్ తరచూ మాట్లాడుతున్నారు. దీనితో జనసైనికులలో అయోమయం మొదలయ్యింది. దీనిబట్టి జేడీ పార్టీ వదిలిపోతారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన గనుక ఆ నిర్ణయం తీసుకుంటే జనసేన ఒక బలమైన ప్రజాధారణ కలిగిన నాయకుడిని కోల్పోయినట్టే.

మరోవైపు కొందరు పార్టీ నుండి జేడీని పొమ్మనలేక పొగబెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏ రకంగా జరిగినా లక్ష్మీనారాయణ పార్టీని వదిలిపోతే అది పార్టీకి నష్టమే. మరోవైపు జనసేనలోని పరిణామాలను బీజేపీ గమనిస్తుంది. జేడీ లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకుని రావాలని బీజేపీ మొదటి నుండీ ఆసక్తిగా ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పరిస్థితిని బట్టి జేడీ ఎన్నికల ముందు బీజేపీ వైపు చూడలేదు. దీనితో ఇప్పుడు జేడీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.