జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం రాజకీయంగా యాక్టీవ్ అయ్యారు. తిరుపతి ఉపఎన్నిక తరువాత స్తబ్దుగా మారిన ఆయన ఏపీలో రోడ్ల అద్వాన్న స్థితి మీద నిరసనలకు పిలుపునిచ్చారు.
సహజంగా రొటీన్ గా సాగిపోవాల్సిన ఈ నిరసన వైసీపీ నాయకులు కొందరు శ్రీకాకుళంలో ఒక జనసేన నాయకుడిని చితకబాదడంతో బాగా హైలైట్ అయ్యింది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. రోడ్ల మీద నిరసన అనే అంశం మీద వైఎస్సార్ కాంగ్రెస్ మీడియా పవన్ కళ్యాణ్ మీద దాడి మొదలయ్యింది.
ఇది మొదట టీడీపీ అందుకున్న అంశమని… అది పెద్దగా క్లిక్ కాకపోవడంతో పవన్ కళ్యాణ్ తో మళ్ళీ ట్రై చేస్తున్నారని ఆరోపణ. అక్కడ నుండి మొదలెట్టి పవన్ కళ్యాణ్… చంద్రబాబు ఒకటే అని… 2024లో కలిసి పోటీ చేస్తారని ఏవేవో కథనాలు వండి వారుస్తున్నారు.
2024లో జనసేన – టీడీపీ కలిసి పోటీ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు… అయితే దీనికీ దానికీ సంబంధం ఏమిటో అర్ధం కాదు. ఏపీలోనైనా ఇంకో రాష్ట్రంలోనైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అంశం ఉంటే అన్ని ప్రతిపక్ష పార్టీలుకు అది అంశమే. సెపరేట్ గా ఇది టీడీపీ అంశం… జనసేన అంశం… వామపక్షాల అంశం అని ఏమీ ఉండదు.
టీడీపీ ఎత్తుకున్న అంశాన్ని పవన్ కళ్యాణ్ ముట్టుకోకూడదు అని ఏమీ లేదు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ మీద పోరాడిన అమరావతి వంటి అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. అప్పుడు పవన్ కళ్యాణ్, జగన్ రహస్య మిత్రులు అయ్యారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతారో అర్ధం కాదు. పవన్, చంద్రబాబు కలుస్తారేమో అనే ఊహే ఇంతగా భయపెడుతుంటే… ఇక నిజంగా కలిస్తే ఏమైపోతారో?