janasena Party in hurryమానవ బాంబులా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని చంపేస్తానంటూ రాజమండ్రికి చెందిన పవన్ ఫణి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం, దాన్ని డిలీట్ చేయడం… ఆ పైన పోలీసులు అరెస్ట్ చేయడం వడివడిగా జరిగిపోయాయి.

ఇలాంటి అనుచిత పోస్ట్ లు గానీ, వ్యాఖ్యలు గానీ చేసే వారితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెనువెంటనే జనసేన నుండి అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో కార్యకర్తలకు కావాల్సిన మానసిక స్థైర్యతను ఇవ్వడంలో జనసేన విఫలమైందన్న విమర్శలు వెలువడ్డాయి.

ఇదంతా పక్కన పెడితే, అరెస్ట్ చేసిన పవన్ ఫణిపై ఏపీ సీఐడీ పోలీసులు సెక్షన్ 121, 124ఏ రాజద్రోహంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదు చేసారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేలా శాంతి భద్రతల సమస్యకు దారితీసేలా ఫణి పోస్ట్ ఉన్నాయని ఆరోపిస్తూ గుంటూరులోని ఆరో అదనపు కోర్ట్ ఇంచార్జ్ న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ ఎదుట సమర్పించారు.

మొత్తం పరిశీలించిన మీదట న్యాయమూర్తి చెప్పింది ఏమిటంటే, ఫణిపై నమోదు చేసిన నేరాలు సరిగా లేవని తేల్చారు. అలాగే రాజద్రోహం వంటి తీవ్రమైన సెక్షన్లు చెల్లవని, ఇంకొన్ని సెక్షన్లు అయితే ఏడేళ్లలోపు శిక్ష పడేవి ఉన్నాయంటూ రిమాండ్ నివేదికను తిరస్కరించారు. అంతేగాక ఫణి సొంత పూచీ కత్తుపై విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసారు.

పార్టీ పరంగా జనసేన తీసుకున్న సిద్ధాంతం సమంజసం అయి ఉండొచ్చు గానీ, కార్యకర్తలకు, అభిమానులకు ఇబ్బంది అయినపుడు వారికి అండగా ఉంటేనే పార్టీపై నమ్మకం మరింతగా పెరుగుతుంది, పార్టీ కోసం ఇంకా శ్రమించాలన్న ఉత్సాహం కార్యకర్తలకు కలుగుతుంది. ఈ పవన్ ఫణి విషయంలో జనసేన తీసుకున్న నిర్ణయం పూర్తి వైఫల్యంగా మారింది.

ప్రజా జీవితంలోకి వచ్చినపుడు ఇలాంటి వాటిని భరించాలని పార్టీ పరంగా జనసేనకు తెలిసి ఉండాలి. సహజంగా ఏ పార్టీకైనా లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. జనసేనలో అయితే నాయకులే న్యాయవాదులు ఉన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ, దిలీప్ సుంకర వంటి న్యాయవాదులు పార్టీకి అందుబాటులో ఉండి కూడా ఓ కార్యకర్తకు అండగా నిలబడకపోవడం సమంజసం కాదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.