janasena party flag at RRR eventతమ అభిమాన హీరో ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడా? అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. పవన్ ఎక్కడ సభ పెట్టినా, అక్కడ వాలిపోయి ఫ్యాన్స్ చేసే హంగామాకు ఎక్కడా కొదవుండదు. ఆ మాటకొస్తే ఒక్క పవన్ సభలలోనే కాదు, ఇతర హీరోల వేడుకలలోకి వెళ్ళిపోయి, అక్కడ ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ నినాదాలు చేయడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కొత్తేమీ కాదు.

తాజాగా కర్ణాటకలో జరుగుతోన్న “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా జనసేన జెండాను ఎగుర వేసి, మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఓ పెద్ద స్థంభం పైకి ఎక్కి అందరికి కనిపించే విధంగా జనసేన జెండాను పతాక స్థాయిలో నిలబెట్టారు. నిజంగా ఇలా చేయడానికి ఎంతో అభిమానం ఉండాలి, అంత నిస్వార్థమైన అభిమానం ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గానీ, అవసరమైనపుడు ఆ అభిమానం చూపించకపోవడమే పవన్ ఫ్యాన్స్ తీరులోని అసలు ట్విస్ట్.

ఇటీవల ఆవిర్భావ సభలో కూడా పవన్ సీరియస్ గా మాట్లాడేటప్పుడు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తుండగా, చాలా గట్టిగానే మందలించారు. ఎనిమిదేళ్లుగా ఫ్యాన్స్ ను కాస్త దగ్గరగా చూడడం వలన, వాళ్ళు ఎలాంటి వారో అర్ధం చేసుకున్నారో ఏమో గానీ, ఇటీవల చాలా సందర్భాలలో ఫ్యాన్స్ ను ఉద్దేశించి పవన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు అలా ‘సీఎం సీఎం’ అని అరిస్తే అయిపోను, వెళ్లి ఓట్లు వేయండి అప్పుడు అవుతానని అనేక సందర్భాలలో స్పష్టంగా చెప్తున్నారు.

అయితే పవన్ ఎన్ని చెప్పినా అభిమానుల తీరులో మాత్రం ఎక్కడా మార్పు రావట్లేదని చెప్పడానికి నేడు “ఆర్ఆర్ఆర్” ఈవెంట్ ఒక ఉదాహరణ. జనసేన పార్టీకి – ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎక్కడైనా సంబంధం ఉందా? మల్టీస్టారర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ సినీ వేడుకను ఎంతో అట్టహాసంగా చిత్ర యూనిట్ చేసుకుంటోంది. అక్కడికి వెళ్లి జనసైనికులు సాధించేది ఏంటి? ఒకవేళ వెళ్లినా వేడుకను ఎంజాయ్ చేసి రావాలి గానీ, తమ పార్టీ పబ్లిసిటీ చేసుకోవడం నిజంగా పవన్ కళ్యాణ్ హర్షించే విషయమేనా?

ఇలాంటి వాటికి పవన్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. తమ అభిమాన హీరో సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, మళ్ళీ ఆయననే విపరీతంగా అభిమానించడం అనేది ఒక్క పవర్ స్టార్ ఫ్యాన్స్ విషయంలోనే జరుగుతుందని చెప్పవచ్చు. పవన్ ముఖ్యమంత్రి కావాలన్నా, జనసేన జెండా ఏపీలో రెపరెపలాడాలన్నా చేయాల్సింది ఇలాంటి పనులు కాదని అభిమానులు ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో?! దీని వలన పార్టీకి చేకూరే ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువ.

ఈ పోకడలతో హర్ట్ అయిన ఇతర హీరోల అభిమానులు, పవన్ ఫ్యాన్స్ ను కాకుండా, నేరుగా పవన్ నే వ్యతిరేకిస్తే జనసేన పార్టీకి దోహదపడుతుందా? ఇలాంటి ఆకతాయి పనులు సోషల్ మీడియాలో కాసేపు హంగామా చేయడానికి అయితే పుష్కలంగా పనికి వస్తాయి గానీ, పార్టీ బలోపేతానికి గానీ, నాయకుడుగా పవన్ కళ్యాణ్ ఎదుగుదలకు గానీ నిరుపయోగం. ఇది గుర్తించి సజావుగా ప్రవర్తించిన నాడే అన్ని వర్గాలకు తమ అభిమాన హీరోను చేరువ చేసిన వారవుతారు.