janasena-party-activists-help-at-kims-new-notesబిజెపి నేతలను క్యూలైన్ లో నిలబడి ప్రజలకు సహాయం అందించమని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ‘జనసేన’ అధినేత మాటలు పొలిటికల్ వర్గాల్లో హీట్ ను పెంచాయి. అయితే ఇవేవో బిజెపి నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగడం కాకుండా, పలువురు జనసేన నేతలు ప్రజలకు స్వచ్చంధంగా సహాయం అందిస్తుండడం విశేషం. రాజకీయ విమర్శలు తమ ఉద్దేశం కాదు, అంతిమంగా ప్రజా సంక్షేమమే అన్న సిద్ధాంతాన్ని ‘జనసేన’ అనుసరిస్తోందని ఈ సందర్భంగా చెప్పవచ్చు.

మార్కెట్ లో చలామణి అవుతోన్న 2000 రూపాయల నోటు కారణంగా సరిపడా చిల్లర దొరకక ఇబ్బంది పడుతోన్న నిమ్స్ ఆసుపత్రిలోని రోగుల కుటుంబాలకు ‘జనసేన’ నేతలు చిల్లర పంచిపెట్టారు. దాదాపు 25 వేల వరకు తెచ్చిన చిల్లరను ఆసుపత్రిలోని పలువురు రోగులకు పంపిణీ చేసి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే రకమైన రీతిలో స్పందించాలని కోరారు. అయితే ఇదేమి ‘జనసేన’ అధికారికంగా ప్రకటించిన కార్యక్రమం కాకపోయినా, ‘జనసేన’ జెండాలతో పవన్ అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఆసుపత్రిలో చిల్లర పంపిణీ చేయడంతో ఒక్కసారిగా చిల్లర కావాల్సిన వారు ఎగబడడంతో కాస్త గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఆసుపత్రి వర్గాలు సూచించగా, తాము తెచ్చిన 25 వేలు అయిపోయిన తర్వాత, మళ్ళీ వస్తామని అక్కడ నుండి వెళ్ళిపోయారు. మొత్తానికి ‘జనసేన’ ద్వారా పవన్ స్థాపించిన సిద్ధాంతాలను అభిమానులు బాగానే ఒంటపట్టించుకున్నట్లుగా కనపడుతోంది.