Janasena MLA Rapaka Varaprasad praises YS Jaganశాసనసభ బడ్జెట్ సమావేశాలలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అభివృద్దిని ,సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ అన్నారు. బడ్జెట్ తీరును ఆయన ప్రశంసిస్తూ మాట్లాడారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ఆయన కుమారుడు జగన్ కూడా వ్యవసాయం గురించి శ్రద్ద చూపుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అన్న విదంగా తీసుకు వచ్చింది రాజశేఖరరెడ్డి అని ఆయన అన్నారు.

ఇప్పుడు జగన్ కూడా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. పంటల నష్ట పోయి ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబానికి ఏడు లక్షల పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం హర్షణీయమని అన్నారు. కౌలు రైతులకు ఒప్పందపత్రాన్ని ప్రవేశపెట్టడాన్ని కూడా ఆయన సమర్ధించారు. రైతులు జగన్ ప్రభుత్వం కోసం ఎదురు చూశారని ఆయన అన్నారు. మత్సకారులు కూడా జగన్ పై నమ్మకం పెట్టుకున్నారని, వారు కోరుకోకుండానే వారికి వరాలు తీర్చే వ్యక్తిగా జగన్ ను చూస్తున్నారని వరప్రసాద్ అన్నారు.

జగన్ ను ఈ రేంజ్ లో పొగుడుతున్నారంటే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా జగన్ మీద జనసేన పార్టీ వైఖరిలోనే మార్పు వచ్చిందా అనేది వచ్చే అనుమానమే. అయితే జనసేనలో కొందరు మాత్రం రాపాక వరప్రసాద్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో పార్టీకి ఆయన మీద పట్టు లేదని దానితో ఆయన స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారని, పార్టీ మారినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. దీనితో ఏమవుతుందో అనే ఆందోళనలో జనసైనికులు ఉన్నారు.