Janasena MLA Rapaka Varaprasad praises YS Jagan on english mediumజనసేన పార్టీలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసివెయ్యడం పై జనసేన పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో నైనా, బయటైనా ఈ విషయంపై పదే పదే మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాదనకు సొంత పార్టీలోనే మద్దతు లేకపోవడం ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

విషయంలోకి వెళ్తే… జనసేన నుండి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఈరోజు శాసనసభలో పార్టీ లైన్ దాటారు. ఇంగ్లీష్ మీడియం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు రాపాక వరప్రసాద్ రావు. గతంలో ఎంతోమంది విద్యార్థులు ఇంగ్లీష్ రాకపోవడంతో మంచి ఉద్యోగాలు సాధించలేకపోయారని.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారన్నారు.

ఈ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని.. స్వాగతించాలని అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఒక ఛానల్ లో మాట్లాడిన రాపాక దానిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే శాసనసభలో పార్టీ లైన్ ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటం రాపాకకు కొత్తేమి కాదు. ఇది ఇలా ఉండగా రేపు రైతుల కోసం దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ వద్దకు రాపాక వెళ్లపోవడం విశేషం.

తాను గెలిచిన దగ్గర నుంచి పార్టీ మారతానని పదే పదే చెబుతున్నారని, అసెంబ్లీ వలన పవన్ దీక్షకు వెళ్లలేక పోతున్నానని రాపాక చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో తనకు జనసేన పార్టీలో ప్రాధాన్యత ఉందా? లేదా? అనే దానిపై తరవాత మాట్లాడతానని ఆయన చెప్పడం విశేషం.