Bolishetty Satyanarayana on Pushpaసోషల్ మీడియాలో ఫాలోయింగ్ కలిగిన జనసేన నాయకులలో బొలిశెట్టి సత్యనారాయణ ఒకళ్ళు. పార్టీ సంగతులతో నిత్యం ట్విట్టర్ లో అప్ డేట్ చేస్తూ సందడి చేసే ఈ జనసేన నేత, ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప” రిలీజ్ అయిన రోజే సినిమాపై ఓ ట్వీట్ వేశారు.

శేషాచలం అడవులను కాపాడాలన్న బాధ్యతతో తీసిన “పుష్ప” అద్భుతం. తగ్గేదేలే.. అనే పుష్పరాజ్ తప్ప, అల్లు అర్జున్ సినిమాలో కనబడడు, ఎర్రచందనం ఎగుమతి ఎలా అవుతుందో చూపుతూనే దాని నివారణ, పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను ప్రభుత్వానికి, ప్రజలకు గుర్తు చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి, చిత్ర బృందానికి దండం పెడుతూ వేసిన ట్వీట్ కు నెటిజన్ల రిప్లైలు హిలేరియస్ గా ఉన్నాయి.

జనసేనకు భలే నాయకులు దొరికారులే అని ఒకరంటుంటే, మేం చూసిన ‘పుష్ప’ సినిమానే మీరు కూడా చూసింది అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. బహుశా భవిష్యత్తులోకి వెళ్లి ‘పుష్ప 2’ ఏమి చూసి రాలేదు కదా? అని ఇంకొకరు. ఈ ట్వీట్ చూస్తే సుకుమారే ఆశ్చర్యపోతారేమో అని… ఇలా బొలిశెట్టి గారి ‘పుష్ప’ ట్వీట్ నెటిజన్లకు మాంచి హాస్యాస్పదంగా మారిపోయింది.

సరే నెటిజన్ల పంచ్ లు పక్కన పెడితే, ఇంతకీ బొలిశెట్టి గారి రివ్యూతో ఏకీభవించే వారు ఎవరైనా ఉన్నారా? అలాంటి భావన ‘పుష్ప’ సినిమా చూసిన తర్వాత బొలిశెట్టి సత్యనారాయణకు తప్ప ఇంకా ఏ ఒక్కరికైనా కలిగిందంటారా? ఏమోలే… రాజకీయ నాయకులు చూసే ప్రపంచం… కనిపించే సినిమా… చాలా భిన్నంగా ఉంటాయని ఇలాంటప్పుడే తెలుస్తుంది.