Janasena Leader Akula Satyanarayana on caste politicsజనసేన పార్టీ నుండి ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ వీడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పార్టీ మారే ఆలోచన లేదంటూనే ఆకుల సత్యనారాయణ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కులసమీకరణాలతో రాజకీయం చేస్తే భంగపాటు తప్పదని ఆయన అనడం విశేషం. జనసేనను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారా అనే అనుమానాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో పవన్‌ ప్రజల్లో ఉంటారో లేదో కాలమే నిర్ణయిస్తుందన్నారు.

పవన్‌ కళ్యాణ్ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్లు ఆయన అభిప్రాయపడ్డారు. 2014లో రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా టీడీపీ తో పొత్తును ఉపయోగించుకుని ఎన్నికైన ఆకుల ఏపీలో ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జనసేనలో చేరారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో విభేదాల కారణంగా ఆయన బీజేపీని వీడారనే వార్తలు కూడా వినిపించాయి. జనసేన తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ సైతం… వైఎస్సార్ కాంగ్రెస్ మినహా ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీనితో ఆకుల ప్రస్తుతానికి వెళ్లడం లేదని చెప్పినా ఆయన సొంత పార్టీలోకి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువని తెలుస్తుంది. ఇప్పటికే జనసేన నుండి మాజీ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీజేపీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.