Janasena latest newsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన “జనసేన” పార్టీ, తదుపరి సార్వత్రిక ఎన్నికలలో బరిలోకి దిగుతుందన్న విషయం తెలిసిందే. అయితే మొత్తం స్థానాలకు పోటీ చేస్తారా? లేక ఎంపిక చేసిన ప్రాంతాల వరకే బరిలోకి దిగుతారా అన్న విషయం ఇప్పట్లో తేలేది కాదు గానీ, పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుపై రెండు ప్రధాన పార్టీలు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ఇప్పుడే విమర్శలు చేసి అభిమాన జనాలకు దూరం కావడం ఎందుకని, వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. అలాగే పవన్ కూడా ప్రస్తుతానికి ఎలాంటి డేరింగ్ స్టెప్ తీసుకునే విధంగా కనపడడం లేదు.

అయితే ప్రస్తుత పరిస్థితుల రీత్యా… వచ్చే ఎన్నికలలో జనసేన బరిలోకి దిగితే ఎన్ని స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది? ఇటీవల ఓ మీడియా ఛానల్ నిర్వహించిన సర్వేలో జనసేనకు అనుకూలంగా మార్కులు రాలేకపోయిన విషయం తెలిసిందే. కానీ, పార్టీ పరంగా అంతర్గత సర్వే ప్రకారం అయితే… తమ పార్టీకి 57 నుండి 62 స్థానాల వరకు రావచ్చని జనసేన అధికార ప్రతినిధి సున్కర్ కళ్యాణ్ దిలీప్ తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. అంటే మరో రెండేళ్ళు గడిచినా, జనసేన పెద్దగా వృద్ధి చెందదని చెప్పారా? అనేది అర్ధం కాని ప్రశ్న?

అయితే ప్రస్తుతం జనసేన వెంట ఉన్న యువతరం ఓటింగ్ అంతా పవన్ కు పడుతుందా? లేదా? అన్నది వచ్చే ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రమే తేలే విషయం గానీ, పవన్ ప్రభావం ఎంతో కొంత అయితే ఉందన్నది స్పష్టం. అయితే అది 60 స్థానాల వరకు వెళ్తుందా? లేక అంతకు మించి ఉంటుందా? ఇంకా తగ్గుతుందా? అనేది కీలకం కానుంది. ఎందుకంటే సుంకర కళ్యాణ్ చెప్పినట్లు… జనసేనకు 60పై చిలుకు స్థానాలు దక్కితే, ఖచ్చితంగా ‘కింగ్ మేకర్’ పవన్ కళ్యాణ్ అవుతారని చెప్పడంలో సందేహం లేదు. మరి ప్రజలు కానిస్తారా? లేదో వేచిచూడాలి. పోనీయ్… ఆ దిశగా పవన్ అడుగులు వేస్తారా? అన్నది కూడా ప్రశ్నార్ధకమే!