pawan-kalyan-jana-sena-politicsఅవును… నిజమే… ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు బాగానే ఒంటపడుతున్నాయి. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాబట్టి, ‘ముందు నవ్వి, వెనుక గోతులు’ తీసే ఈ వర్తమాన రాజకీయాల్లో ఎలా మనుగడ సాగిస్తారా? అన్న ప్రశ్నలు వేసిన వారికి నిదానంగా సమాధానం లభించే విధంగా పవన్ అడుగులు పడుతున్నాయని చెప్పాలి. రాజకీయాలలో ముక్కుసూటితత్వం పనికి రాదన్న విషయం అందరికీ తెలిసిందే. బహుశా తన లోపాలను సవరించుకునే క్రమంలో ఉన్నారో ఏమో గానీ… తాజాగా బిజెపి నేతలకు చురకలంటించారు.

దేశంలో అలజడి రేపుతోన్న కరెన్సీ కొరత వలన చనిపోయిన కర్నూలు జిల్లా వాసి బాలరాజుకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్… ఆ తర్వాత బిజెపి ఎంపీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కేంద్రంలోని ఎంపీలంతా ప్రజల కష్టాలకు సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడితే బావుంటుంది. అలాగే ఆంధ్రా బిజెపి ఎంపీలు, తెలంగాణా ఎంపీలు కూడా ఏటీఎంల దగ్గర, బ్యాంకుల దగ్గర నిలబడి తమ వంతు మద్దతు ప్రకటిస్తే ప్రజలకి కాస్త ధైర్యంగా ఉంటుందని” పిలుపునిచ్చారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో రెండు రకాల అర్ధాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ గా తీసుకుంటే… మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కష్టాలు పడుతున్నారు గనుక, వారి సాధకబాధకాలు తెలుసుకునేందుకు హానెస్ట్ గా బిజెపి నేతలకు ఓ పిలుపునివ్వడం. అయితే బిజెపి విధానాల పట్ల పవన్ గత వైఖరి చూస్తే… ఇది పిలుపునివ్వడం కంటే కూడా కాస్త వెటకారాన్ని జోడించి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పట్ల తన విధివిధానాలు ఏమిటో చెప్పకనే చెప్పారు.

పవన్ చెప్పినా, చెప్పకపోయినా… ఒక్క బిజెపి ఎంపీ కూడా ఏటీఎం దగ్గరకు గానీ, బ్యాంకు దగ్గరకు గానీ వెళ్ళరన్న విషయం తెలిసిందే. ఆ మాటకొస్తే ఏ పార్టీ ఎంపీ కూడా పవన్ చెప్పిన విధంగా ప్రజలకు మద్దతుగా నిలిచే అవకాశాలు లేవు. అయితే కేంద్రంలో బిజెపి నిర్ణయం తీసుకుంది గనుక, పవన్ వారిని మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడే పవన్ రాజకీయ చతురత కనపడుతోంది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజల పరంగా బాగానే అనిపించినా… బిజెపి నేతలకు మాత్రం ఓ రేంజ్ లో మంట పుట్టిస్తాయి. అలాగని పవన్ పై బిజెపి నేతలు దండయాత్రలు చేస్తే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలా బిజెపి నేతలను ఒక్క ట్వీట్ తో ఇరకాటంలో పడేసాడు ‘జనసేన’ అధినేత.